బెంగళూర్ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగళూర్‌లో ఇటీవల ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 42 కోట్లతో పాటు మరికొందరి వ్యక్తుల వద్ద రూ. 50 కోట్లు పట్టుబడటం కలకలం రేపింది. ఈ డబ్బు కాంగ్రెస్ నేతలకు సంబంధించిందని బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ నళినీ కుమార్ కటీల్ ఆరోపించగా ఇవి నిరాధార ఆరోపణలని సీఎం సిద్ధరామయ్య తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏటీఎం ప్రభుత్వాన్ని (ATM Government) నడుపుతున్నదని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం నుంచి నిధులు సమకూరుస్తున్నారని, స్వాధీనం చేసుకున్న డబ్బు కాంగ్రెస్‌దేనని కటీల్ ఆరోపణలు గుప్పించారు.
ప్రజల సొమ్మును లూటీ చేసి దండుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, తాలూకా కేంద్రాల్లో బీజేపీ భారీ ప్రదర్శనలు చేపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఏటీఎం సర్కార్ నడుస్తోందని తాము చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధారాలు కోరిందని, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమకు ఆధారాలు అందించారని అన్నారు.
కొద్దిరోజుల కిందట కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేయగా ఓ కాంట్రాక్టర్ ఇంటి నుంచి రూ. 45 కోట్లు సీజ్ చేశారని కటీల్ పేర్కొన్నారు. పట్టుబడిన డబ్బు కాంగ్రెస్ నేతలదేనని వెల్లడవుతోందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం, డిప్యూటీ సీఎంలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిధుల కోసం కర్నాటక ప్రభుత్వం ఏటీఎం ప్రభుత్వంలా మారి ప్రజల సొమ్మును లూటీ చేస్తోందని దుయ్యబట్టారు.
Read More :
Rohit Sharma | ఇది బ్యాట్ పవర్ కాదు బాస్.. బాడీ పవర్.. అంపైర్‌కు రోహిత్ శర్మ అదిరిపోయే రిప్లే