Kanimozhi : మహిళలు పనిచేసే చోట వేధింపుల నుంచి వారిని కాపాడాల్సిన అవసరం ఉందని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. తమకు భద్రత కల్పించాలని మహిళలు కోరడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె పేర్కొన్నారు. కనిమొళి బుధవారం చెన్నైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహిళలపై ఏ రకమైన వేధింపులు జరగకుండా నిరోధించడం ముఖ్యమని చెప్పారు. పని ప్రదేశాల్లో మహిళలను కాపాడుకోవాలని ఇది మనందరి కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు.
కాగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన లైంగిక దాడి వ్యతిరేక బిల్లుపై సీపీఐ నేత అన్నీ రాజా బుధవారం స్పందించారు. చట్టాలను రూపొందించినా వాటిని పకడ్బందీగా అమలు చేయడమే మన దేశంలో ప్రధాన సమస్యని స్పష్టం చేశారు. భారత పార్లమెంట్ మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ఎన్నో చట్టాలను ఆమోదించిందని గుర్తుచేశారు. మీడియాలో ఏ అంశం ప్రధానంగా వెలుగుచూసినా ఆపై ప్రజాగ్రహం వెల్లువెత్తితే మనం కొత్త చట్టాలను చేయడమో, ఉన్న చట్టాలకు సవరణ చేయడమో చూస్తుంటామని చెప్పారు.
చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడమే సమస్య అని ఆమె పేర్కొన్నారు. చట్టాలను సరిగ్గా అమలు చేసేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులను రాష్ట్రాలకు చేపట్టకపోవడం మరో ప్రధాన అవరోధమని అన్నారు. కాగా, హత్యాచార కేసులో నిందితులకు మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. లైంగిక దాడి వ్యతిరేక బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. దీనికి అపరాజిత బిల్లు అని పేరు పెట్టారు. లైంగిక దాడికి పాల్పడిన వారికి జీవితఖైదు విధించేలా చట్టాన్ని తీసుకొచ్చారు.
Read More :