సుదూర తీరంలో ఉన్న జీవనది గోదారి
తానెన్నడు కలగన లేదు
ఉపనది మంజీరతో సంగమిస్తానని
కృషీవలుల సేద్యంలో ఉదయిస్తానని
పరవశింపజేస్తూ పరుగెత్తే
నదీపరవళ్లు తామెన్నడు
ఊహించనే లేదు
దిశను మార్చుకుంటామని
సరికొత్త తోవలో పయనిస్తామని
నదీజలాలను తనలో నింపుకోవాలని
చూసిన సంద్రం నమ్మలేకపోయింది
జలాలు ఎగువకు ఎగబాకుతాయని
కర్షక ఎదలను పులకింపజేస్తాయని
చెమ్మగిల్లే చెరువమ్మలు అంచనా వేయనే లేదు
నిండుకుండలా కళకళలాడుతామని
ఊరికి ఆధార దండై వికసిస్తామని
మంజీర హొయలతో మురిసిపోయే
వనదుర్గమ్మ అనుకొని ఉండదు
అనుసంధానంలో భాగమవుతానని
సాగు సంబరానికి సాక్షినవుతానని
స్నానంతో పుణ్యమిచ్చే గోదారమ్మ తలచి ఉండదు
అపర భగీరథుడి చేతిలో చక్కబడతానని
శ్రమజీవుల చెమటకు సాయమవుతానని
పరుగులు తీసే నేటి తరానికి
ఊహకందనే లేదు
మహాద్భుతాన్ని కండ్లారా చూస్తామని
చారిత్రాత్మక ఘట్టాన్ని చరిత పుటల్లో లిఖిస్తామని
పరుగు పరుగున వచ్చేస్తున్న
కాళేశ్వర జలాలకు స్వాగతం
సంగమ స్థలాన హారతి బట్టిన
మంజీరనాదమై ప్రణమిల్లుతున్నా
గిర్ని అంజాగౌడ్
94948 25665
ఇవి కూడా చదవండి..