ఆయన పల్లె చిత్రాల రారాజు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు తన కుంచెతో రంగులద్దారు. బతుకమ్మ, బోనాలు, కృష్ణా గోపాలురు, గీత కార్మికుల వంటి వందలాది చిత్రాలతో చిత్రకళా రారాజుగా పేరొందారు. తెలంగాణ పేరును ప్రపంచానికి పరిచయం చేసిన ఉత్తమ చిత్రకారుడు కాపు రాజయ్య.
కాపు రాజయ్య 1925 ఏప్రిల్ 7వ తేదీన సిద్దిపేటలోని నిరుపేద కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ కళాశాల నుంచి చిత్రకళలో డిప్లొమా పొందారు. లలితకళా అకాడమీ ద్వారా ఆయన జెకొస్లొవేకియా, హంగేరి, రుమేనియా, బల్గేరియా దేశాల్లో ప్రదర్శనలు పెట్టారు. రాజయ్యను జేఎన్టీయూ గౌరవ డాక్టరేట్ ద్వారా గౌరవించింది. ఆయన ఏ బొమ్మ గీసినా జీవం ఉట్టిపడేది.
రాజయ్య తండ్రి రాఘవులు సిద్దిపేటలో చిరు వ్యాపారి. ఆయనకు రాజయ్య మూడో సంతానం. చిన్న వయస్సులోనే తండ్రి మరణించడంతో రాజయ్య కుటుంబం ఇబ్బందుల పాలైంది. కుబేరుడనే ఉపాధ్యాయుడు రాజయ్యలో ఉన్న చిత్రకళను గుర్తించి ప్రోత్సహించారు. రాజయ్య ఆరవ తరగతిలో ఉన్నప్పుడే మొదటి చిత్ర ప్రదర్శన జరిగింది. ఆయనకు 50 దాకా అవార్డులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం 1966లో రజత పత్రంతో, 1969లో తామ్ర పత్రంతో సత్కరించింది. 1975లో ఆయనకు చిత్రకళా ప్రపూర్ణ సత్కారం లభించింది.
కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా ఆయన పుట్టిన గడ్డను మరువలేదు. మొదట సంప్రదాయబద్ధమైన, కాలపరీక్షకు నిలిచిన ప్రాచ్య విధానం (వాష్ పద్ధతి)లో చిత్రాలు వేశారు రాజయ్య. ఆ తర్వాత నకాషీ చిత్రకారుల అద్భుతమైన కళ ఆయన్ను ముగ్ధుడ్ని చేసింది. నకాషీ చిత్రకారులంటే ఆయనకు ఎనలేని అభిమానం. 1950-1970 వరకు ఆయన టెంపరా చిత్రాలు వేశారు. ఆయన వేసే నకాషీ శైలి చిత్రాల్లో వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంటపొలాలు, వసంతకేళి, కోలాటం, బోనాలు, బతుకమ్మలు నేపథ్యాలుగా ఉండేవి.
ఆయన చిత్రకళకు గుర్తుగా 1993లో కళాప్రవీణ, 1997లో కళా విభూషణ్, 2000లో హంస, 2007లో లలిత కళారత్న అవార్డులు అందుకున్నారు. విదేశాల్లో సైతం ఆయన చిత్రాల ప్రదర్శనలు జరిగాయి. రాజయ్య చిత్రాలను పార్లమెంట్ హౌజ్, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్, సాలార్జంగ్ మ్యూజి యం, ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీల్లో ప్రదర్శనకు పెట్టారు. చిత్రకళకు విశిష్ట గుర్తింపు తెచ్చిన కాపు రాజయ్య 2012 ఆగస్టు 20న తన 87వ ఏట పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మరణించారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆ చిత్రకళ నిత్యనూతనంగా భావిభారతతరాలకుత మార్గదర్శకంగా నిలుస్తున్నది. కాపు రాజయ్య యావత్ చిత్రకళా ప్రపంచంలో ఎల్లవేళలా నిలిచి ఉండే మహనీయుడు.
నరేష్ జాటోత్
ఇవి కూడా చదవండి..