e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home ఎడిట్‌ పేజీ విశ్వరూపుడు విష్ణువు!

విశ్వరూపుడు విష్ణువు!

విశ్వరూపుడు విష్ణువు!

భారతీయుల నిత్య ఆరాధ్య దైవం విష్ణువు. ఎన్నో అవతారాలతో అర్చామూర్తిగా పూజలందుకుంటున్న మూర్తి విష్ణుమూర్తి. విష్ణువంటే ‘వ్యాపనశీలత కలిగినవాడు’. మన హృదయాలతో సహా ఈ సృష్టి అంతటా వ్యాపించినవాడు విష్ణువు. దశావతారాల వెనుక గొప్ప వైజ్ఞానిక భావన, ఆరాధనాంశాలున్నాయి. అవి అర్థం చేసుకుంటే ‘సృష్టి మూల స్వరూపం’ బోధపడుతుంది. ఆ తత్తోపాసనలోని లక్ష్యం తెలుస్తుంది.


‘శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం…’
– విష్ణు స్తోత్రం

విష్ణు సహస్ర నామాలలోనూ ‘విశ్వం విష్ణుః వషట్కారో..’ అని ప్రారంభిస్తాం. వేదమంత్రాలలోనూ ‘విష్ణు, విష్ణుపద’ శబ్దాలు చాలా చోట్ల కనిపిస్తాయి. ‘అంతటా వ్యాపించేది విశ్వం’. అదే మనకు ‘విష్ణు స్వరూపం’ అవుతున్నది. అనంతమైన శక్తి మధ్యలో వ్యాపించి కనిపించేదంతా విశ్వమే. అనంతంలో మూడు భాగాలు పూర్తిగా అర్థం కాకుండా ఉంటే, ఒక భాగం అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నదని ‘పురుషసూక్తం’ చెబుతున్నది. అక్కడినుంచి విశ్వభావన కలుగుతుంది.


త్రిపా దూర్ధ్వ ఉదైత్‌ పురుషః
పాదోస్యేహా భవాత్‌ పునః
తతో విశ్వం వ్యక్రామత్‌..
– పురుష సూక్తం


అందుకే, విష్ణువును అనంతుని ఒడిలో పడుకున్నట్లుగా చూపించడం మూర్తి సంప్రదాయం. కనిపించే, కనిపించని అన్ని ప్రదేశాల్లోకీ ప్రవేశించేది విశ్వం, వ్యాపించినవాడు విష్ణువు. కనుక, విశ్వమే విష్ణువు. విశ్వరూపుడే విష్ణువు. కనిపించని వ్యాపనరూపం నుంచి కనిపించే రూపం వైపు ప్రయాణించడమే అవతార లక్ష్యం. కిందికి రావడమే అవతారం!


భారతీయ ఇతిహాస, పురాణాల్లో ఎక్కడైనా విశ్వరూపాన్ని చూపించిన మూర్తి కూడా విష్ణువే. శ్రీకృష్ణావతారంలో మనకు విశ్వరూప భావన విశేషంగా కనిపిస్తుంది. ‘భగవద్గీత’ శ్రీ కృష్ణుని విశ్వరూపాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తూ, ఒక అధ్యాయాన్నే కేటాయించింది. దృగ్గోచరమైన ఆకాశాన్ని పరిశీలిస్తే, కనిపించే ఆకాశపు నీలివర్ణమే విష్ణువు వర్ణమైంది. రాముడు, కృష్ణుడు అందరూ నీలిమేఘ వర్ణులే. విశ్వానికి మూలం అనంత శక్తి. దానినే సర్పంగా, ఆదిశేషునిగా అభివర్ణించింది భారతీయ సమాజం. విష్ణువు నాభి కమలంలోంచి బ్రహ్మ పుట్టినట్లుగా చూపించడమూ వ్యాపనమైన సృష్టిలో వ్యక్తమైన, జీవించడానికి అవకాశమున్న ప్రకృతిని సూచించే ప్రయత్నమే. అదే అనంత పద్మనాభ స్వరూపం. విష్ణువు పాదాల వద్ద ఉన్న లక్ష్మీదేవి కూడా ప్రకృతిలోని పాంచభౌతిక శక్తికి, దాని ద్వారా మనం పొందే ఐశ్వర్యాదులకు సంకేతం. ఇలా, మనం నివసించడానికి అవకాశం కలిగించిన విశ్వాన్ని ఆరాధించే విధానమే విష్ణుమూర్తికి మనం చేసే నిత్యార్చన!


వ్యక్తి శక్తిగా, మానవుడు మహనీయుడిగా మారడానికి తమ చుట్టూ ఉండే శక్తులను నిరంతరం ఉపాసించాల్సిందే. ఈ విశ్వాన్ని ఉపాసించే క్రమమే విష్ణువు ఆరాధన. ఈ భూమి జీవయోగ్యం కావడం, జలమయం నుంచి భూమి బయటకు రావడం, ఈ భూమిపై సమస్త జీవసృష్టి ఏర్పడటం అనే అంశాలను తెలియజేసేందుకే విష్ణు అవతారాలన్నీ ఉద్దేశితమై ఉన్నాయి. విష్ణువు ఉపాసన వల్ల మనలోని జడత్వం పోతుంది. వ్యాపనశీలత పెరుగుతుంది. పూర్వ తత్తాల్లోనూ మార్పు వస్తుంది. మరింత వికాసం సాధ్యమవుతుంది. ఇది అందరి హృదయాల్లో వ్యాపించే ప్రయత్నమూ జరుగుతుంది. ఈ మేరకు గుర్తింపు కలుగుతుంది. అనేక కార్యక్రమాల నిర్వహణ తాలూకు శక్తి ఏర్పడుతుంది. విస్తరించే బలం పుంజుకుంటుంది. ‘లోకమంతా తమ ఇల్లే’ అనే వసుధైక కుటుంబ భావన స్థిరపడుతుంది. అందుకే, ఆ విష్ణువుని విశ్వరూపుడుగా ఆరాధిద్దాం, ఆనంద రూపులమవుదాం.

విశ్వరూపుడు విష్ణువు!


సాగి కమలాకరశర్మ

ఇవి కూడా చదవండి..

కరువు తీరా నీరు

సముచిత న్యాయం కీలకం

పంటభూములపై పన్నీటి జల్లు

గోదారీ.. ప్రణామం

పల్లె చిత్రాల రారాజు

Advertisement
విశ్వరూపుడు విష్ణువు!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement