ఇది కేసీఆర్ ఓటమి కాదు, తెలంగాణ ప్రజల ఓటమి. ఓడిపోయింది బీఆర్ఎస్ కాదు, తెలంగాణ. పదేండ్ల పాటు రారాజులా బతికిన తెలంగాణ.. నేడు కాంగ్రెస్ పాలనలో గోస పడుతున్నది. సాగు నీళ్లు లేక, పంటలు ఎండిపోయి రైతాంగం తల్లడిల్లిపోతున్నది. తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ‘మార్పు.. మార్పు..’ అంటూ కాంగ్రెస్‌ను నమ్మి తినే అన్నంలో మట్టి పోసుకున్నరు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న సంక్షేమాన్ని కాంక్షించే పాలకుడే నిజమైన, నికార్సైన దేశ భక్తుడు. ఆ లెక్కన చూస్తే రైతును కంటికి కాచుకున్న తెలంగాణ రథసారథి కేసీఆర్‌ను మించిన దేశభక్తుడు ఎవరున్నారు? దేశభక్తి అంటే నిత్యం తప్పుడు ప్రచారాలు చేయడం కాదు. దేశభక్తి అంటే ప్రజల క్షేమాన్ని కాంక్షించడం. వారి మంచి కోసం నిత్యం మథనపడటం. ఆ గుణం కేసీఆర్‌లో పుష్కలంగా ఉన్నది. పాజిటివ్‌గా ఆలోచించే వాళ్లకు, సమాజాన్ని ప్రేమించే వాళ్లకు మాత్రమే కేసీఆర్ ఆలోచనలు, ఆశయాలు, ఆయన పథకాలు అర్థమవుతాయి. చిల్లర మాటలు మాట్లాడుతూ అదే రాజకీయమని అనుకునేవాళ్లకు కేసీఆర్ ఆలోచనలు, ఆచరణలు అర్థమయ్యే అవకాశమే లేదు.
తెలంగాణ ఏమైపోయినా ఫర్వాలేదు కానీ కేసీఆర్ అధికారంలో ఉండొద్దని కుట్రలు చేసే మూర్ఖులు తప్ప బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు. ప్రజలందరి సమస్యలను ఒకేసారి పరిష్కరించడం ఏ పాలకుడికీ సాధ్యం కాదు. ఒకప్పటి తెలంగాణ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. సరైన పాలకుడు లేక నానా కష్టాలు పడుతున్న రాష్ర్టాలు, దేశాలు చాలా ఉన్నాయి. తెలంగాణపై విషం చిమ్మేవాళ్ల మాటలు పొరపాటున నమ్మితే మళ్లీ మన రాష్ట్రం మరో 20 ఏండ్లు వెనక్కివెళ్లిపోతుంది. తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటవుతున్నారు. తెలంగాణ ప్రేమికులందరూ ఏకం కాకపోతే నష్టపోయేది మనమే.
కేసీఆర్ ఆషామాషీ నాయకుడు కాదు. తెలంగాణ పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు. అందుకే దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యం కాని తెలంగాణను సాధించారు. సాధించిన తెలంగాణను ప్రగతి పథంలో నడిపారు. కనీసం మూడు దశాబ్దాల సమయం పట్టే కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తిచేసి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. సాగును బాగు చేశారు.
విమర్శలు ఆయనకు కొత్తకాదు. బహూశా ఈ దేశంలో ఆయనకున్నంత శత్రువులు (రాజకీయంగా) ఎవ్వరికీ ఉండకపోవచ్చు. తెల్లారి లేస్తే కేసీఆరే వారి టార్గెట్. అయితే విమర్శ అనేది కొంచెం వివరణాత్మకంగా ఉండాలే. కానీ, ఈ మూర్ఖుల ముఠా చేసే విమర్శలు అర్థం పర్థం లేనివి. ఒక ఆరోపణ చేస్తారు. కానీ, దాన్ని నిరూపించరు. అడ్డదిడ్డంగా మాట్లాడుతారు. ఒక నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు కొంత విజ్ఞత అవసరం. ఆ విజ్ఞతను కోల్పోయి వికృత చేష్టలతో కొందరు మూర్ఖులుగా మిగిలిపోతున్నరు. ఎవరో చెప్పేది కాదు, కేసీఆర్ అంటే ఏంటో చరిత్ర చెప్తుంది. ఆయ న్ను ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకు రెట్టించిన వేగంతో పైకి లేస్తడు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం.
– ఆలేటి రమేష్ 99487 98982