Rahul-Priyanka Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన సోదరి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మధ్య ఉన్న సోదర బంధంపై బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ (Kailash Vijayvargiya) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో రాహుల్ తన సోదరి పట్ల చూపే ఆప్యాయత భారతీయ సంస్కృతికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అది విదేశాల నుంచి తెచ్చుకున్న విలువలని విమర్శించారు.
మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో గురువారం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కైలాశ్ విజయవర్గీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మేము పాత సంస్కృతికి చెందినవాళ్లం. మా సోదరీమణుల గ్రామంలో కనీసం నీళ్లు కూడా తాగము. మా అత్త నివసించే జిరాపూర్కు వెళ్లినప్పుడు నా తండ్రి కుండ నీరు తీసుకెళ్లేవారు. కానీ, నేడు మన ప్రతిపక్ష నాయకులు తమ సోదరీమణులను నడిరోడ్డుపైనే ముద్దుపెట్టుకుంటున్నారు.
మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను.. మీలో ఎవరైనా బహిరంగంగా మీ సోదరిని లేదా కూతురిని ముద్దుపెట్టుకుంటారా..? ఇది విలువలు లేకపోవడమే. ఇవన్నీ విదేశాల్లో పెరగడం వల్ల వచ్చిన విదేశీ విలువలు. వాళ్లు మన ప్రధాన మంత్రితో కూడా అమర్యాదగానే మాట్లాడతారు’ అని అన్నారు. కైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంపై స్పందించిన కైలాశ్ విజయవర్గీయ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అది రాహుల్ గాంధీ తప్పు కాదని వ్యాఖ్యానించారు. ఆయన విదేశాల్లో చదువుకొని అక్కడి విలువలను ఇక్కడికి తీసుకొచ్చారంటూ విమర్శించారు. ‘అది ప్రతిపక్ష నేత తప్పు కాదు. విదేశాల్లో చదువుకొని అక్కడి విలువలను ఇక్కడికి తీసుకొచ్చారు. రాహుల్‌కు భారతీయ సంప్రదాయాల గురించి అవగాహన లేదు. ఆయన ప్రధాన మంత్రిని కూడా అమర్యాదగా ‘నువ్వు’ అని సంబోధిస్తారు’ అంటూ విజయవర్గీయ వ్యాఖ్యానించారు.
Also Read..
MiG-21 Fighter jet | రిటైర్ అయిన మిగ్-21 ఫైటర్ జెట్స్.. 62 ఏళ్ల సేవలకు గుడ్‌బై చెప్పిన వాయుసేన
Saree Theft | అమానుషం.. చీరలు దొంగిలించిందని మహిళను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి.. VIDEO