New CJI Justice Surya Kant | జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఇటీవల సీజేఐ బీఆర్ గవాయ్ ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో.. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆయన నవంబర్ 24న సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయన 2027 ఫిబ్రవరి 7వ తేదీ వరకు జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా కొనసాగుతారు. దాదాపు ఆయన 15 నెలలు పదవిలో ఉంటారు.
జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 10, 1962న హిసార్ జిల్లా పెట్వర్ గ్రామంలో జన్మించారు. ఆయనది మధ్యతరగతి కుటుంబం. ఆయన తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడిగా పని చేశాను. తల్లి గృహిణి. 1981లో హిసార్‌లోని ప్రభుత్వ పీజీ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఆ తర్వాత 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ (LLB) పూర్తి చేశారు. ఈ సమయంలో న్యాయ విద్యతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకున్నారు. అదే సంవత్సరం హిసార్‌లోని జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. చండీగఢ్‌లోని పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగించారు. పలు కీలకమైన కేసుల్లోనూ వాదనలు వినిపించారు. న్యాయపరమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. జూలై 7, 2000న హర్యానా అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. ఆ తర్వాతి సంవత్సరం ఆయన సీనియర్ అడ్వకేట్‌గా పదోన్నతి పొందారు. జనవరి 9, 2004న, ఆయన పంజాబ్-హర్యానా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు. 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొందారు. అక్టోబర్ 5, 2018న, ఆయన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2019లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందగా.. 2024 నవంబరు 12 నుంచి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా పని చేస్తున్నారు.
జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడు. అలాగే, దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ తీర్పు ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని ఆదేశించారు. వాక్ స్వాతంత్య్రం, అవినీతి, బిహార్ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగసమానత్వం తదితర అంశాల్లోనూ కీలక తీర్పులను వెలువరించారు. ఇటీవల బిహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ (SIR)లో భాగంగా తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ధర్మాసనంలోనూ జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టుతో పాటు అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లలో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆదేశించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్(OROP) పథకాన్ని సమర్థిస్తూ.. రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందంటూ ఆయన తీర్పునిచ్చారు. ప్రస్తుతం శాశ్వత సర్వీసుల్లో మహిళా అధికారులను నియమించే పిటిషన్‌తో పాటు మరికొన్ని కీలక పిటిషన్లపై సైతం వాదనలు వింటున్న బెంచ్‌లలో సభ్యుడిగా ఉన్నారు.