న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) కీలక నిర్ణయం తీసుకున్నది. టర్కీ యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపివేసింది. (JNU suspends MoU with Turkey) జాతీయ భద్రతా కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం వెల్లడించింది. ‘జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా, జేఎన్‌యూ, టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయం మధ్య జరిగిన అవగాహన ఒప్పందం తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేస్తున్నాం’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.
కాగా, అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడితో పాటు ఇతర విద్యా పరమైన కార్యక్రమాల కోసం జేఎన్‌యూ, టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయం మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఒప్పందం జరిగింది. మూడేళ్ల పాటు ఇది అమలులో ఉండనున్నది.
మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యలను టర్కీ వ్యతిరేకించింది. పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంతోపాటు డ్రోన్లు, ఆయుధాలను అందించింది. దీంతో టర్కీపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ దేశం వస్తువులను వ్యాపారులు బహిష్కరించారు. ట్రావెల్ ఏజెన్సీలు కూడా టూర్ ప్యాకేజీలను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో టర్కీ యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని జేఎన్‌యూ నిలిపివేసింది.