న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ.. గవర్నర్ రమేశ్ బాయిస్‌కు ఫిర్యాదు చేయడంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ అధిష్ఠానం అధికారపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బుట్టలో వేసుకుంటుందనే అనుమానంతో సీఎం సోరెన్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
ముందుగా అధికార యూపీఏ పక్షం ఎమ్మెల్యేలందరినీ రాంచిలో తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. వారిని విహారయాత్రలకు తీసుకెళ్లారు. అయినా బీజేపీ అధినాయకత్వం అధికారపక్షంలో చీలికలకు ప్రయత్నాలు చేస్తుండటంతో.. తాజాగా అందరినీ పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. ఈ మధ్యాహ్నం రాంచిలోని సీఎం నివాసం నుంచి రెండు బస్సుల్లో విమానాశ్రయానికి బయలుదేరిన ఎమ్మెల్యేలు.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చేరుకున్నారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అక్రమంగా తనకు తానే మైనింగ్ లీజు కేటాయించుకున్నాడని ఆరోపిస్తూ బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును గవర్నర్ ఈసీ పరిశీలనకు పంపారు. పరిశీలించిన ఈసీ.. సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్‌కు సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.