Assembly Elections | న్యూఢిల్లీ, నవంబర్ 20 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు బుధవారం పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో చాలా సంస్థలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే రెండు రాష్ర్టాల్లో అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే యాక్సిస్ మై ఇండియా సంస్థ ఒక్కటే కాంగ్రెస్-జేఎంఎం కూటమి జార్ఖండ్‌లో 53 సీట్లు దక్కించుకుంటుందని పేర్కొంది. ఇక్కడ బీజేపీ కూటమి 25 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 145. అలాగే 81 సభ్యులున్న జార్ఖండ్‌లో మ్యాజిక్ ఫిగర్ 41. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-ఎన్సీపీ కూటమితో కూడిన మహాయుతి అధికారంలో ఉండగా, కాంగ్రెస్-శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌పవార్)లతో కూడిన మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) విపక్షంగా ఉంది. జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి రాష్ర్టాన్ని పాలిస్తున్నది. పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహారాష్ట్రలో మహాయుతి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోనుంది. జార్ఖండ్‌లో హోరాహోరీ పోరు నెలకొననున్నది.
వెలువడిన మొత్తం 9 ఎగ్జిట్ పోల్స్‌లో మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని నాలుగు సంస్థలు అంచనా వేశాయి. మూడు సంస్థలు మాత్రం హంగ్ ఏర్పడుతుందని పేర్కొనగా, రెండు సంస్థలు హోరాహోరీ పోరు ఉంటుందని తెలిపాయి. ఇక పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. మహారాష్ట్రలో మహాయుతి కూటమికి 150 సీట్లు, మహావికాస్ అఘాడీ కూటమికి 125 సీట్లు రానున్నాయి.
జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలో ఉన్న జార్ఖండ్‌లో హోరాహోరీ పోరు నెలకొన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎన్డీయేకు 39, ఇండియా కూటమికి 38 సీట్లు రానున్నాయి. 81 సీట్లున్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు అవసరం. కాగా, యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 7 స్థానాలను బీజేపీ కూటమి గెల్చుకుంటుందని పలు సంస్థలు అంచనా వేశాయి.
ముంబై, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ)/ రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ నియోజకవర్గాలకు బుధవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ఒకే విడతలో జరిగిన పోలింగ్‌లో 60 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో నమోదైన 61.74 శాతం కన్నా ఇది స్వల్పంగా తక్కువ. 288 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో గడ్చిరోలి జిల్లాలో అత్యధికంగా 69.63%ఓటింగ్ నమోదైంది. నాందేడ్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో 53.78% నమోదైంది.
జార్ఖండ్‌లో బుధవారం 38 స్థానాలకు జరిగిన రెండో, ఆఖరి విడత ఎన్నికలలో సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికల శాతం (67.04) కన్నా స్వల్పంగా అధికం. జంతార జిల్లాలో అత్యధికంగా 76.16%, బొకారో జిల్లాలో అత్యల్పంగా 60.97% పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొదటి విడత ఎన్నికలు నవంబర్ 13న జరిగాయి. ఓట్ల లెక్కింపు 23న జరుగుతుంది.