e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home Top Slides మళ్లీ రాష్ట్ర హోదా!

మళ్లీ రాష్ట్ర హోదా!

మళ్లీ రాష్ట్ర హోదా!
  • జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర హోదాకు ప్రధాని మోదీ సానుకూలం
  • అఖిలపక్ష సమావేశ అనంతరం విపక్షాల వెల్లడి
  • మూడున్నర గంటలు కొనసాగిన భేటీ
  • కశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమన్న మోదీ
  • దీనికోసం ఎన్నికల నిర్వహణ అవసరమని వెల్లడి
  • కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి, అభివృద్ధిపై కూడా భేటీలో చర్చ

న్యూఢిల్లీ, జూన్‌ 24: జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే తమ ప్రధాన లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో సమగ్రాభివృద్ధి జరుగాలంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరమున్నదని, అందుకోసం ఎన్నికలు జరుగాలన్నారు. అంతకుముందు త్వరితగతిన నియోజకవర్గాల పునర్విభజన అవసరమన్నారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీల నేతలతో గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన ట్వీట్‌ చేశారు. అంతకుముందు, ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో సుమారు మూడున్నర గంటలపాటు అఖిలపక్ష భేటీ జరిగింది. జమ్ముకశ్మీర్‌లోని ఎనిమిది ప్రధాన పార్టీలకు చెందిన 14 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే అంశంపై మోదీ సానుకూలంగా స్పందించారని విపక్ష నేతలు తెలిపారు. కశ్మీర్‌ అభివృద్ధి, ప్రత్యేక ప్రతిపత్తి రద్దు గురించి కూడా భేటీలో చర్చ జరిగినట్టు పేర్కొన్నారు. భేటీకి హాజరైన వారిలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫారూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌, సీపీఎం నేత యూసఫ్‌ తరిగామి తదితరులు ఉన్నారు. కేంద్ర మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌ పాల్గొన్నారు.

సరైన సమయంలో..
సరైన సమయంలో జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని విజ్ఞప్తులపై విపక్ష నేతలు సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నాయి. జమ్ముకశ్మీర్‌ ప్రజల రక్షణ, భద్రతకు కట్టుబడి ఉన్నట్టు ప్రధాని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ‘ఢిల్లీతో పాటు హృదయాల మధ్య నెలకొన్న దూరాల్ని తొలగించాలి’ అని నేతలతో మోదీ అన్నట్టు వివరించాయి. పాకిస్థాన్‌తో సంబంధాల గురించి ప్రశ్నించగా.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గేదాకా పాక్‌తో చర్చల ప్రసక్తే వద్దని కశ్మీర్‌ బీజేపీ నేతలు చెప్పినట్టు పేర్కొన్నాయి.

- Advertisement -

పాక్‌ ఉగ్ర సంస్థలపై ఎస్సీవో చర్యలు తీసుకోవాలి: ధోవల్‌
న్యూఢిల్లీ: పాక్‌కు చెందిన ఉగ్రసంస్థలు లష్కరే తాయిబా, జైషే మహమ్మద్‌పై చర్యలకు షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అజిత్‌ ధోవల్‌ సూచించారు. తజ్‌కిస్థాన్‌లో ఎస్సీవో భద్రతా అధికారులతో సమావేశమైన ధోవల్‌.. ఐరాస తీర్మానాలను, సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలను అమలు చేయాలని కోరారు.

కశ్మీర్‌ రాష్ట్రహోదా రద్దు దేశానికే సిగ్గుచేటు: మమత
కోల్‌కతా : జమ్ముకశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర హోదాను తొలగించటం దేశానికి సిగ్గుచేటు అని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ దుయ్యబట్టారు. ఆమె మాట్లాడుతూ.. ‘జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించాల్సిన అవసరం ఏముంది? ఇది దేశానికి ఏ విధంగానూ సాయపడలేదు. గత రెండేండ్లుగా పర్యాటకులు కశ్మీర్‌కు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి’ అని విమర్శించారు.

కశ్మీర్‌లో 50 శాతం తగ్గిన హింస
శ్రీనగర్‌ : గతంతో పోలిస్తే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధిత హింస 50 శాతానికి పైగా తగ్గిందని ఆర్మీ తెలిపింది. కుప్వారా జిల్లాలోని హంద్వారా ఏరియాలో ఆర్మీ ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ డి.పి. పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. కశ్మీర్‌లో అన్ని రకాల హింస 50 శాతానికి పైగా తగ్గిందని చెప్పారు. ఇందులో ఆర్మీ ఎనలేని పాత్ర పోషించిందని అన్నారు.

అఖిలపక్షం అనంతరం ఎవరేమన్నారు?
మోదీ:
జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ప్రాధాన్యతాంశం.
అమిత్‌ షా:రాష్ట్రహోదా పునరుద్ధరణలో నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ మైలురాళ్ల వంటివి.
ఫారూఖ్‌ అబ్దుల్లా: జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించి ఇక్కడి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి.
ఒమర్‌ అబ్దుల్లా: ఇతర రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరుగనున్నది. జమ్ముకశ్మీర్‌లో ఇప్పుడే ఎందుకు? కేంద్రంపై కశ్మీర్‌ ప్రజలకు నమ్ముకంపోయింది. దాన్ని పునరుద్ధరించాలి.
మెహబూబా ముఫ్తీ: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కోసం మా పోరాటం కొనసాగుతుంది.
గులాంనబీ ఆజాద్‌: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణ, రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీర్‌ పండిట్లకు పునరావాసం ఇవే మా డిమాండ్లు.
యూసఫ్‌ తరిగామి:ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు ముందు ఈ భేటీ నిర్వహించాల్సింది. ఇదో మంచి ఆరంభం మాత్రమే. అంతకుమించి ఏమీలేదు. ఈ సమావేశంతో ఫలప్రదమైన ఫలితాలు సాధించినట్టు కనిపించడంలేదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మళ్లీ రాష్ట్ర హోదా!
మళ్లీ రాష్ట్ర హోదా!
మళ్లీ రాష్ట్ర హోదా!

ట్రెండింగ్‌

Advertisement