Pahalgam attack | పెహల్గామ్ ఉగ్రవాదుల (terrorists) కోసం వేట కొనసాగుతోంది. ఈ దాడికి పాల్పడిన ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గత కొన్ని రోజులుగా కశ్మీర్ లోయలో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన పోస్టర్లను భద్రతా సంస్థలు తాజాగా విడుదల చేశాయి.
‘టెర్రర్ ఫ్రీ కశ్మీర్’ అన్న సందేశంతో ఈ పోస్టర్లు జమ్ము కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో గల పలు ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. అందులో ఉగ్రవాదుల గురించి సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ఆ పోస్టర్లలో అధికారులు పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచనున్నట్లు హామీ ఇచ్చారు.
కాగా, గత నెల 22న పెహల్గామ్లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. సమీపంలోని అడవిలో నుంచి వచ్చిన ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ పాశవిక దాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2019లో జరిగిన పుల్వామా మారణహోమం తర్వాత కశ్మీర్ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. ఈ ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉంటే తమకు ఇవ్వాలని స్థానికులు, పర్యాటకులను అధికారులు ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే. అంతేకాదు ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని కూడా గతంలోనే ప్రకటించారు.
Also Read..
Floods | వరద బీభత్సం.. 100 మందికిపైగా మృతి
Flights Cancelled | ఆ నగరాలకు విమాన రాకపోకలు బంద్.. ఎందుకంటే?