Flight Cancel | ఇండిగో, ఎయిర్ ఇండియా మంగళవారం పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ సహా మరో మూడు సరిహద్దు ప్రాంతాలకు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్‌లైన్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు విమాన కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్‌కోట్ నగరాలకు ఇండిగో విమానాలను రద్దు చేసింది. అయితే, ఇండిగో ప్రయానికులకు అడ్వైజరీని జారీ చేసింది. తాజాగా పరిణామాల దృష్ట్యా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్కోట్లకు బయలుదేరే మంగళవారం బయలుదేరే విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీనగర్, అమృత్సర్ సహా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న 32 విమానాశ్రయాలను మూసివేసిన విషయం తెలిసిందే. అయితే, కాల్పుల విరమణ అవగాహనతో సరిహద్దుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరడంతో విమానాలు నడిపేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి ఇచ్చింది. సోమవారం సాయంత్రం సాంబా సెక్టార్లో మళ్లీ పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. ఈ క్రమంలో పలు సరిహద్దు నగరాలకు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలను రద్దు చేశాయి. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య మే 9న దేశంలోని 32 విమానాశ్రయాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మే 10న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన నేపథ్యంలో సోమవారం ఉదయం 12 గంటలకు విమానాశ్రయాలను తిరిగి తెరిచి.. తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించారు.
వాస్తవానికి మే 9న, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI).. సంబంధిత విమానయాన అధికారులు ఎయిర్మెన్లకు (NOTAM) వరుస నోటీసులు జారీ చేశారు. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను అన్ని పౌర విమాన కార్యకలాపాల కోసం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిషేధం మే 9 నుంచి మే 14, 2025 వరకు అమలులో ఉంటుందని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విమానాశ్రయాలలో అధంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపుర, బటిండా, భుజ్, బికనీర్, చండీగఢ్, హల్వారా, హిండన్, జమ్మూ ఉన్నాయి. అంతకు ముందు 24 విమానాశ్రయాలను మే 10 వరకు మూసివేయాలని ఆదేశించారు. అయితే, భారత్-పాకిస్తాన్ ప్రతిష్టంభన తొలగడంతో తాత్కాలికంగా మూసివేసిన 32 విమానాశ్రయాల్లో మళ్లీ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయంటూ సోమవారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. శనివారం భారతదేశం-పాకిస్తాన్ దేశాలు భూమి, వాయు, సముద్రంపై అన్ని రకాల కాల్పులు, సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసేలా అవగాహనకు వచ్చారు. దాంతో ఎయిర్పోర్ట్ అథారిటీ విమాన కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చింది.