Fidayeen | ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేకొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థ భారత్ వ్యాప్తంగా భారీ దాడులకు కుట్ర (Attack On India) చేసినట్లు నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. ఇందుకోసం ఫిదాయిన్ (ఆత్మాహుతి దళం)ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల కోసం జైషే సంస్థ నిధులను కూడా సమకూరుస్తున్నట్లు నిఘా వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా నివేదిస్తోంది.
ముజాహిద్‌లకు వింటర్ కిట్లను అందించేందుకు ఈ విరాళాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి 20వేల పాకిస్థాన్ రూపాయలు అంటే భారత కరెన్సీలో రూ.6,400 విరాళంగా సేకరిస్తున్నట్లు తెలిసింది. ముజాహిద్ల కోసం బూట్లు, ఉలెన్ సాక్స్, మెట్రెస్, టెంట్ వంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు ఈ డొనేషన్లను సేకరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ విరాళాలను పాకిస్థాన్‌కు చెందిన సదాపే వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌ల నుంచి స్వీకరిస్తున్నట్లు సమాచారం. మేడమ్ సర్జన్ (Madam Surgeon)గా వ్యవహరిస్తున్న ఎర్రకోట పేలుడులో కీలక అనుమానితుల్లో ఒకరైన డాక్టర్ షాహీనా సాయిద్ (Dr Shahina Saeed) ఈ విరాళాల బాధ్యత తీసుకున్నట్లు తేలింది. దీంతో ఈ డిజిటల్ ఫండింగ్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
మరోవైపు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు కొత్త కుట్రకు తెరలేపిన విషయం తెలిసిందే. కేవలం మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్‌ను తయారుచేస్తున్నది. మసూద్ అజార్ (Masood Azhar) సోదరి సాదియా అజార్ (Sadiya Azhar) నేతృత్వంలో ‘జమాతుల్-ముమినాత్’ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్‌ను తయారుచేస్తున్నది. మహిళలకు ఆన్లైన్ జిహాదీ కోర్సులను (online jihadi course) కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగానే భారత్‌లోని మహిళలను ఆకర్షించేందుకు కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్‌లో జైషే మహిళా విభాగం (Jaishs Women Wing In India) బాధ్యతలను ఎర్రకోట పేలుడులో కీలక అనుమానితుల్లో ఒకరైన డాక్టర్ షాహీనా సాయిద్‌కు అప్పగించినట్లు తేలింది. ‘మేడమ్ సర్జన్’ పేరుతో ఆమె ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు.
Also Read..
Delhi Blast | పార్కింగ్‌లోనే బాంబు తయారు చేసిన డాక్టర్ ఉమర్.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయం
Al Falah Group: టెర్రర్ ఫండింగ్.. 13 రోజుల పాటు ఈడీ కస్టడీలో అల్ ఫలాహ గ్రూపు చైర్మెన్