Jairam Ramesh : యూపీఎస్సీ లేటరల్ రిక్రూట్మెంట్పై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. గత పదేండ్లుగా ప్రధాని మోదీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇప్పుడు ఆయన వాస్తవాలను ఎదుర్కోవాల్సిన పరిస్ధితి నెలకొందని, ఇష్టారీతిన వ్యవహరించే రోజులకు కాలం చెల్లిందని అన్నారు.
45 ఉన్నతోద్యోగ ఖాళీలను యూపీఎస్సీ ప్రకటించిందని, ఇవి సలహాదారుల పోస్టులు కాదని జైరాం రమేష్ పేర్కొన్నారు. సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, సెక్రటేరియట్ హోదా కలిగిన పోస్టుల రిక్రూట్మెంట్ చేపట్టారని, వీటి భర్తీలో రాజ్యాంగ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అన్నారు. లేటరల్ ఎంట్రీ రిజర్వేషన్లకు ముగింపు పలికే ప్రక్రియకు తెరతీయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పౌర అధికారుల వ్యవస్ధలో అగ్నివీర్‌ను ప్రవేశపెట్టడం వంటిదని వ్యాఖ్యానించారు.సాయుధ దళాల్లో అగ్నివీర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా దేశ భద్రతతో కాషాయ పాలకులు చెలగాటమాడారని, ఇప్పుడు పౌర అధికార వ్యవస్ధతో చెలగాటమాడేందుకు ప్రయత్నిస్తున్నారని జైరాం రమేష్ దుయ్యబట్టారు.
అందుకే ఇది రాజ్యాంగంపై దాడి అని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సహా ఇతర రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేశారు. ఇది ఐఏఎస్, ఇతర పౌర అధికార వ్యవస్ధను ప్రైవేటీకరణ చేయడమేనని, లేటరల్ ఎంట్రీ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని తాము కోరుతున్నామని అన్నారు. లేటరల్ ఎంట్రీ పధకంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం ఎదురవుతున్నదని ఈ జనాగ్రహాన్ని మోదీ ఎదుర్కోవాలని ఆయన పేర్కొన్నారు.
Read More :
Imanvi Esmail | రొట్టె విరిగి నెయ్యిలో పడింది.. ప్రభాస్ హీరోయిన్ కోసం క్యూకట్టిన నిర్మాతలు