Rajasthan : రాజస్థాన్‌లోని జైపూర్‌లో పోలీసుల అత్యుత్సాహంతో యువతికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన ఈ నెల 19న జైపూర్‌లోని జగత్‌పుర ఏరియాలో జరిగింది. ఈ ఘటనపై బాధితులు రాంనగరియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నెల 19న రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కాన్వాయ్ కోసం జగత్‌పుర ప్రాంతంలో పోలీసులు సాయంత్రం ఏడు గంటల సమయంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న వ్యాపారుల్ని వెంటనే తమ షాపుల్ని తొలగించాలని కోరారు.
ఈ సమయంలో ఖుష్బూ గుప్తా, ఆమె చెల్లెలు రేషు గుప్తా కలిపి రోడ్డు పక్కన ఒక తోపుడు బండిపై మోమోస్ హోటల్ నిర్వహిస్తున్నారు. పోలీసులు వచ్చి వెంటనే అక్కడ్నుంచి ఆ బండి తొలగించాలని సూచించారు. దీనికి స్పందించిన అక్కా చెల్లెళ్లు కొంచెం సమయం ఇవ్వాలని, షాపు తొలగిస్తామని కోరారు. కానీ, అది వినిపించుకోని పోలీసులు బండిని తోసేశారు. దీంతో ఈ బండి తలకిందులుగా పడింది. ఇదే సమయంలో బండిపై మోమోస్ చేసేందు కోసం వేడి నీళ్లు మరిగి ఉన్నాయి. పోలీసులు బండిని పడేయడంతో ఆ వేడి నీళ్లు రేషు గుప్తాపై పడ్డాయి. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చేతులతోపాటు అనేక చోట్ల గాయాలయ్యాయి. వెంటనే ఆమెను దగ్గర్లోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు అక్కడ చికిత్స కొనసాగుతోంది. పోలీసుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం వల్లే తన చెల్లి తీవ్రంగా గాయపడిందని ఖుష్బూ ఆరోపిస్తోంది. తాము ఆ బండి తొలగించే పనిలోనే ఉన్నప్పటికీ, పోలీసులు కొంచెం సమయం కూడా ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తించారని ఆమె ఆరోపిస్తోంది.
ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ కుటుంబానికి ఈ బండే ఆధారమని, ఇప్పుడు ఆ బండిని పోలీసులు ధ్వంసం చేశారని ఖుష్బూ గుప్తా చెప్పింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు దేశంలో వీఐపీ కల్చర్‌పై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్నంత మాత్రాన చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అని పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాయకులకు రక్షణ కల్పించడం అంటే సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదని సూచిస్తున్నారు.