Jagannath Chariot : భారత ప్రధాన ఫైటర్ జెట్ (Fighter Jet) అయిన సుఖోయ్-30 (Sukhoi-30) కోసం తయారు చేసిన యుద్ధ విమానం టైర్లను జగన్నాథుడి (Jagannath) రథచక్రాలుగా వాడనున్నారు. ఈ విషయాన్ని కోల్‌కతా (Kolkata) లోని జగన్నాథ మందిరం నిర్వాహక సంస్థ అయిన ఇస్కాన్ (Iskcon) వెల్లడించింది. గతంలో ఈ ఆలయంలోని స్వామివారి రథానికి బోయింగ్ విమానం టైర్లు వినియోగించేవారు.
అయితే గత 15 ఏళ్లుగా వాటిని కొనుగోలు చేయడం ఇస్కాన్‌కు సాధ్యం కాలేదు. గత ఏడాది ఈ రథం టైర్లలో సమస్యలు మొదలయ్యాయి. దాంతో ఇస్కాన్ నిర్వాహకులు సుఖోయ్-30 ఫైటర్ జెట్‌కు వినియోగించే టైర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కోల్‌కతా ఇస్కాన్ ప్రతినిధి రాధారమన్ దాస్ వెల్లడించారు. తాము ఆ టైర్లకు ఆర్డర్ పెట్టడంతో యుద్ధ విమానం టైర్లతో అవసరం ఏంటని సదరు కంపెనీ కూడా ఆశ్చర్యపోయిందని రాధారమన్ దాస్ చెప్పారు.
వారికి రథం సమస్యను వివరించి, ఆలయానికి ఆహ్వానించి పరిశీలించాలని కోరామని తెలిపారు. దాంతో వారు తమకు నాలుగు టైర్లు విక్రయించేందుకు అంగీకరించారని చెప్పారు. తాజాగా వాటిని రథానికి అమరుస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే స్వామివారు సుఖోయ్ కోసం తయారు చేసిన టైర్లు అమర్చిన వాహనంపై ఊరేగుతారని వెల్లడించారు. దాంతో స్వామివారికి దాదాపు 48 ఏళ్ల తర్వాత కొత్త చక్రాలు లభించినట్లైంది.
జగన్నాథ రథం గంటకు 1.4 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని పేర్కొన్నారు. సుఖోయ్ టైర్లు గంటకు 280 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకోగలవని ఆలయ నిర్వాహకులు చెప్పారు.