న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసి ఏడేండ్లు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నామని మోదీ సర్కార్ చెబుతున్నప్పటికీ, దేశంలో నగదు వినియోగం ఇంకా భారీగానే ఉన్నది. ఆస్తులు, భూములు వంటి వాటి కొనుగోలు కోసం ప్రజలు నగదు రూపంలోనే చెల్లింపులు చేస్తున్నారని లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం.. భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసేందుకు 15 శాతం మంది 50 శాతానికి పైగానే నోట్ల రూపంలోనే చెల్లించారు. తమ చెల్లింపుల్లో నగదు భాగం 30-50 శాతం ఉన్నదని 18 శాతం మంది చెప్పారు. 10-30 శాతం మధ్య నగదు ఇచ్చామని 28% మంది పేర్కొన్నారు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం కూడా ప్రజలు నగదుపైనే ఆధారపడుతున్నారు. సర్వేలో పాల్గొన్న 11,189 మందిలో దాదాపు 56 శాతం మంది నిత్యావసరాల కోసం 5-25% వరకు నగదు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. 25-50 శాతం నగదు చెల్లింపులు చేస్తున్నామని 18 శాతం మంది తెలిపారు.