ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ను లాంఛ్ చేయనుంది. ఏపీలోని శ్రీహరి కోటలోని లాంచింగ్ ప్యాడ్ నుంచి 12న ఉదయం 10.17 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ రాకెట్ ద్వారా డీఆర్డీవో రూపొందించిన ఈఓఎస్-ఎన్1 శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనున్నారు.
అలాగే, స్పానిష్ కు చెందిన ఒక స్టార్టప్ తయారు చేసిన కిడ్ (కెస్ట్రెల్ ఇనిషియల్ డెమాన్ స్ట్రేటర్) అనే చిన్న ప్రయోగాత్మక పరికరాన్ని కూడా ఈ రాకెట్ మోసుకెళ్లనుంది. దీంతోపాటు ఇండియా, మారిషస్, లక్సెంబర్గ్, యూఏఈ, సింగపూర్, యూరప్, అమెరికా వంటి దేశాలు రూపొందించిన 17 చిన్న ఉపగ్రహాలు, పరికరాల్ని కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలో ప్రయోగిస్తారు. ఈ ప్రయోగాన్ని ప్రజలు నేరుగానే కాకుండా, డిజిటల్ గా చూసేందుకు కూడా ఇస్రో ఏర్పాట్లు చేసింది. శ్రీహరికోటలోని ఎస్డీఎస్సీ షార్ వ్యూ గ్యాలరీ నుంచి నేరుగా వీక్షించే వీలుంది.
ఇందుకోసం ప్రజలు ఆధార్ వంటి ఐడీల ద్వారా ఆన్ లైన్లో రిజిష్టర్ చేసుకోవచ్చు. ఇస్రో సంస్థ వరుస ప్రయోగాలతో అంతరిక్ష పరిశోధనలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. విదేశాలకు చెందిన ఉపగ్రహాల్ని కూడా అంతరిక్షంలో ప్రవేశపెడుతూ.. భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతూ సత్తా చాటుతోంది. గత డిసెంబర్లో ఎల్వీఎం3-36 రాకెట్ ప్రయోగించింది.