బీరూట్: ఇతర దేశాలతోపాటు భారత సైనికులున్న ఐక్యరాజ్యసమితి శాంతి స్థావరంపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. (Israeli fire on UN Peace base) ఈ సంఘటనలో అక్కడ మోహరించిన ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షకుల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస ప్రాంగణాలను గౌరవించాలని ఇజ్రాయెల్‌కు సూచించింది. ఐరాస శాంతి పరిరక్షణ మిషన్‌లో భాగంగా లెబనాన్‌లో సుమారు 600 మంది భారతీయ సైనికులు ఉన్నారు. అయితే దక్షిణ లెబనాన్‌లోని హెజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైనిక బలగాలు దాడులు చేస్తున్నాయి.
కాగా, లెబనాన్ సరిహద్దులోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం (యూఎన్ఐఎఫ్ఐఎల్) ఉన్న నఖౌరా ప్రధాన కార్యాలయం, ఆ సమీపంలో ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరుపుతున్నది. గురువారం నాటి దాడుల్లో ఐరాస శాంతి స్థావరంలోని వాచ్ టవర్ ధ్వంసమైంది. ఈ సంఘటనలో ఇద్దరు సైనికులు గాయపడినట్లు యూఎన్ పేర్కొంది. గాయపడిన సైనికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
మరోవైపు ఇజ్రాయెల్ కాల్పుల నేపథ్యంలో శాంతి పరిరక్షకుల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బ్లూ లైన్ వెంబడి క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై మేం ఆందోళన చెందుతున్నాం. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. ఐరాస శాంతి ప్రాంగణాల భద్రతను ఉల్లంఘించకూడదు. వాటిని అందరూ గౌరవించాలి. శాంతి పరిరక్షకుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.