Zomato CEO | భద్రతా సమస్యలపై గిగ్ వర్కర్లు (gig workers strike) చేపట్టిన సమ్మెతో అల్ట్రా ఫాస్ట్ డెలివరీలపై మరోసారి చర్చ ఊపందుకుంది. కొత్త సంవత్సరం రోజున వీరి సమ్మె జొమాటో, బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో డెలివరీ సేవలపై పెద్దగా ప్రభావం చూపించనప్పటికీ.. పది నిమిషాల్లో డెలివరీ మోడల్ వల్ల రైడర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో దీనిపై జొమాటో (Zomato CEO) సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal ) స్పందించారు. పది నిమిషాల్లో డెలివరీ విధానంపై వివరణ ఇచ్చారు. ఈ డెలివరీ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని నెటిజన్లకు అర్థమయ్యేలా వివరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వరుస పోస్టులు పెట్టారు.
డెలివరీ వేగం మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుందని, రైడర్లపై ఒత్తిడి ద్వారా కాదని గోయల్ వివరించారు. ‘మీ ఇళ్ల చుట్టూ పెరుగుతున్న దుకాణాల వల్లే మా 10 నిమిషాల డెలివరీ సేవలు సాధ్యమవుతున్నాయి. డెలివరీ పార్ట్నర్స్ వేగంగా డ్రైవ్ చేయడం వల్ల ఇది సాధ్యం కాదు. అసలు డెలివరీ కోసం కస్టమర్‌కు మేం చేసిన టైమర్ ప్రామిస్ రైడర్‌కు యాప్‌లో కనిపించదు. బ్లింకిట్‌లో మాకు వచ్చిన ఆర్డర్‌ను ప్యాక్ చేయడానికి 2.5 నిమిషాల సమయం పడుతుంది. డెలివరీ సగటున 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా 8 నిమిషాల్లో లొకేషన్‌కు రీచ్ అయిపోవచ్చు’ అని తెలిపారు.
అంతేకాదు, డెలివరీలు ఆలస్యమైతే తమ ఏజెంట్లకు ఎలాంటి జరిమానాలూ విధించమని, అలాగే సమయానికి డెలివరీ చేసినందుకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. దీనివల్ల వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదని పేర్కొన్నారు. తమ సంస్థలో డెలివరీ పార్ట్నర్లకు భద్రత కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరికీ వైద్య, జీవిత బీమా అందిస్తున్నామని ఈ సందర్భంగా దీపిందర్ గోయల్ వెల్లడించారు. గిగ్ వర్కర్ల సమ్మె మధ్యే న్యూఇయర్ రోజు జొమాటో, బ్లింకిట్ కలిసి రికార్డు స్థాయిలో 75 లక్షల ఆర్డర్లను డెలివరీ చేసినట్లు తెలిపారు.
Also Read..
Degree College: 19 ఏళ్ల విద్యార్థిని మృతి.. కాలేజీ ప్రొఫెసర్, స్టూడెంట్స్పై కేసు నమోదు
EVMs: ఈవీఎంల పనితీరుపై కర్నాటకలో సర్వే.. రిపోర్టును తిరస్కరించిన రాష్ట్ర మంత్రి
Nataraja Temple | నటరాజ ఆలయంలో ఘనంగా వార్షిక రథయాత్ర.. Video