ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల( Dharamsala) ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(Degree College)లో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని మృతిచెందిన ఘటనలో కాలేజీ ప్రొఫెసర్‌తో పాటు ముగ్గురు స్టూడెంట్స్పై కేసు నమోదు చేశారు. మృతిచెందిన విద్యార్థినిపై ర్యాగింగ్, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఎన్ఎస్లోని 75, 115(2), 3(5) సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ర్యాగింగ్ యాక్ట్‌లోని సెక్షన్ 3 కింద ప్రొఫెసర్ అశోక్ కుమార్, ముగ్గురు అమ్మాయిలపై కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురు అమ్మాయిలను హర్షిత, ఆకృతి, కోమోలికగా గుర్తించారు.
బాధిత విద్యార్థిని తండ్రి విక్రమ్ కుమార్ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కూతురు పల్లవి డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నదని, సెప్టెంబర్ 18వ తేదీన తన కూతురిపై ముగ్గురు అమ్మాయిలు దాడి చేశారని, తన కూతురితో ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. వేధించడం, బెదిరించడం వల్ల తన కూతురు మానసికంగా ఆందోళనకు గురైందని, దాంతో ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు ఆయన చెప్పారు. చికిత్సలో భాగంగా లుథియానా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డిసెంబర్ 26వ తేదీన ఆమె మృతిచెందింది.