బెంగుళూరు: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(EVMs)పై ఓటర్లలో విశ్వాసం అన్న అంశంపై కర్నాటకలో ఇటీవల సర్వే నిర్వహించారు. ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ శాఖ ఆధ్వర్యంలో నడిచే కర్నాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యువేషన్ అథారిటీ ఆ సర్వే చేపట్టింది. సుమారు 5100 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అయితే 85 శాతం మంది ఓటర్లు ఈవీఎంలపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2024 లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించినట్లు తెలిపారు. ఆ సర్వే రిపోర్టు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణకు దారి తీసింది.
ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ శాఖ నిర్వహించిన సర్వేతో తమకు సంబంధం లేదని కర్నాటక ప్రభుత్వం చెబుతోంది. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది. ఓటు చోరీ జరుగుతున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు నిజం కాదు అని బీజేపీ నేత బీవై విజయేంద్ర తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. సర్వే నివేదిక ద్వారా ఆ విషయం స్పష్టం అవుతోందన్నారు. కానీ ఆ సర్వేకు అనుమతి ఇవ్వలేదని కర్నాటక ఐటీశాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. పీఎంవో ఆఫీసుతో లింకున్న ఓ వ్యక్తికి చెందిన ఎన్జీవో సంస్థ ఆ సర్వే చేపట్టినట్లు ఖర్గే తెలిపారు.