టెహ్రాన్: అమెరికా, ఇరాన్ చర్చల్లో కొంత పురోగతి సాధించాయని, అయితే ఒక ఒప్పందానికి రావడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్, ప్రధాన సంధానకర్త మొమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ శనివారం ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో పదేపదే విశ్వాస ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొంటూ శనివారం హొర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనికి ముందు హొర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించడానికి నౌకలు రుసుము చెల్లించాలని ఇరాన్ ఒత్తిడి చేసింది. రుసుము చెల్లించే నౌకలకు చెల్లించని వాటి కంటే ప్రాధాన్యత ఉంటుందని ఒక సీనియర్ ఇరాన్ అధికారి సీఎన్ఎన్కి తెలిపారు.
ఈ చర్య అమెరికాతో చర్చలను క్లిష్టతరం చేసినప్పటికీ హొర్ముజ్ జలసంధిలోని పరిస్థితిని ఘాలిబాఫ్ ఇరాన్‌కు ఒక వ్యూహాత్మక విజయంగా అభివర్ణించారు. శత్రువును మేము నాశనం చేయలేదు. వారి వద్ద ఇప్పటికీ డబ్బు, ఆయుధాలు ఉన్నాయి. కాని వ్యూహాత్మకంగా మా చేతిలో వారు ఓటమి పాలయ్యారు అని ఘాలిబాఫ్ వ్యాఖ్యానించారు. చర్చలు కొనసాగుతున్నప్పటికీ కీలకమైన విభేదాలు ఇంకా పరిష్కారం కాలేదని, అందువల్ల ఏదైనా పురోగతి సాధించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన సూచించారు. చర్చల్లో చాలా అంతరాలు ఉన్నాయని, తుది షరతులపై చర్చించే దశకు ఇరు పక్షాలు ఇంకా చేరుకోలేదని ఆయన చెప్పారు.
మా అణు హక్కులను కాదనడానికి ట్రంప్ ఎవరు?
ఇరాన్ అణు హక్కులను నిరాకరించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అదివారం స్పష్టం చేశారు. సమీపిస్తున్న కాల్పుల విరమణ గడువుకు ముందు అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మేం అణు హక్కులను వినియోగించుకోకూడదని ట్రంప్ ఆదేశిస్తున్నారు. అది ఏ నేరానికి అనేది చెప్పడం లేదు. ఒక దేశం హక్కులను హరించడానికి ఆయన ఎవరు? అని జెష్కియన్ అన్నట్లు ఐఎస్ఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది.