న్యూఢిల్లీ, జనవరి 12: అమెరికాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని, అయితే యుద్ధానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని ఇరాన్ సోమవారం ప్రకటించింది. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు జరుగుతున్న ఇరాన్లో ఒక్క నిరసనకారుడిని హతమార్చినా తాము సైనిక జోక్యం చేసుకుంటామని పదే పదే హెచ్చరికలు జారీచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంతో సంప్రదింపులను ఇరాన్ నాయకత్వం కోరుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ టెహ్రాన్‌లో విదేశీ రాయబారుల సదస్సులో ప్రసంగిస్తూ ఇస్లామిక్ రిపబ్లిక్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కాని యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు.
తాము చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నామని, కానీ అవి న్యాయబద్ధంగా, సమాన హక్కులు, పరస్పర గౌరవం ప్రాతిపదికన ఉండాలని ఆయన షరతు విధించారు. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలను భద్రతా దళాలు అణచివేసిన తర్వాత పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని అరాగ్చీ తెలిపారు. ట్రంప్ జోక్యం చేసుకునేందుకు సాకుగా ఉపయోగపడేందుకు ఇరాన్లో నిరసనలు హింసాత్మకంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశ విదేశాంగ మంత్రికి, అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారికి మధ్య సంప్రదింపులకు ఎటువంటి అవరోధాలు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాగ్చీ తెలిపారు.
కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్‌డౌన్
ఇరాన్లో ఇంటర్నెట్ షట్‌డౌన్ నాలుగో రోజు కూడా కొనసాగుతున్నది. నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 192 మంది మరణించినట్లు నార్వేకు చెందిన ఎన్జీఏ ఇరాన్ మానవ హక్కులు(ఐహెచ్ఆర్) సోమవారం వెల్లడించింది. ఈ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండవచ్చని తెలిపింది. అయితే అనధికారిక వార్తల ప్రకారం వందలాది మంది హింసాత్మక ఘర్షణల్లో మరణించారు. కొన్ని వర్గాల కథనం ప్రకారం 2,000 మందికిపైగా మరణించారని ఐహెచ్ఆర్ వెల్లడించింది. 2,500 మందికిపైగా నిరసనకారులను ఇరాన్ ప్రభుత్వం అరెస్టు చేసినట్లు తెలిపింది. మరోవైపు ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. అల్లర్ల నేపథ్యంలో బయటకు రావొద్దని సూచించింది.
డెత్ టు అమెరికా నినాదాలు.. హింసకు కారణం మొస్సాద్ ‘ఉగ్రవాదులే’ నంటున్న ప్రభుత్వం
టెహ్రాన్: ఇరాన్‌లోని పలు నగరాల్లో ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు జరిగాయి. రాజధాని నగరం టెహ్రాన్ సహా అనేక పట్టణాల్లో సోమవారం వేలాది మంది ప్రదర్శనకారులు వీధుల్లోకి వచ్చి, సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ‘ఉగ్రవాదం’, ‘విదేశీ మద్దతు గల అశాంతి’గా అభివర్ణించారు.
విదేశీ శక్తుల కారణంగానే దేశంలో హింస జరుగుతున్నదని ప్రభుత్వ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ ప్రమేయం ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఆరోపించారు. ఇదిలావుండగా, రెండు వారాల నుంచి జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో 544 మంది మరణించినట్లు, సుమారు 10,600 మంది అరెస్ట్ అయినట్లు హ్యూమన్ రైట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.