IndiGo | న్యూఢిల్లీ, మార్చి 30: భారత్‌లోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఈ సంస్థకు ఆ శాఖ రూ.944.20 కోట్ల జరిమానా విధించింది. కాగా, ఐటీ శాఖ జరిమానా విధింపును తప్పుడు, పనికిమాలిన చర్యగా ఇండిగో యాజమాన్యం పేర్కొంది. దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటామని వెల్లడించింది. జరిమానా ఉత్తర్వు ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్‌కు శనివారం అందింది. ఈ జరిమానా 2021-22 మదింపు సంవత్సరానిదని ఆ సంస్థ వెల్లడించింది. ఈ జరిమానా చట్టంలోని నిబంధనల ప్రకారం విధించినది కాదని పేర్కొంది. కాగా, ఇప్పటికే ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న సంస్థకు ఐటీ శాఖ నోటీసు ఇబ్బంది కలిగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.