న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమాన టికెట్ల ధరలు రూ. 40,000కు పెరిగిపోయినప్పటికీ అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆక్షేపించిన హైకోర్టు పరిస్థితిని ఆందోళనకరంగా అభివర్ణించింది. వేలాది విమానాల రద్దు కారణంగా విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించాలని ఇండిగోను చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.
తాము ఆందోళన వ్యక్తం చేస్తోంది కేవలం ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మాత్రమే కాదని, దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రతికూల ప్రభావంపైనని ధర్మాసనం తెలిపింది. విమానాల రద్దు కారణంగా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారం అందేలా పౌర విమానయాన మంత్రిత్వశాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), ఇండిగో తగిన చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
సంక్షోభం తర్వాత చర్యలా?
పరిస్థితి తీవ్రరూపం దాల్చడానికి, సంక్షోభం తలెత్తిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. సంక్షోభం ఏర్పడిన సమయంలో ఇతర ఎయిర్‌లైన్స్ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ఎందుకు అనుమతించారు? టికెట్ చార్జీలు రూ. 35,000-రూ.40,000కు ఎలా పెరుగుతాయి? పరిస్థితి ముదిరిపోవడానికి మీరే అనుమతించారు. దీని వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలగడం మాత్రమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది అని హైకోర్టు పేర్కొంది. దీనికి అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ జవాబిస్తూ దేశంలోనే అతి పెద్ద ఎయిర్‌లైన్ ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఎయిర్‌లైన్‌కు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేశామని కేంద్రం తరఫున తెలిపారు.
ఇండిగో నిర్వహణ వైఫల్యం కారణంగా కొన్ని రూట్లలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఉదాహరణకు గత వారం ఢిల్లీ-ముంబై నాన్ స్టాప్ విమాన ఛార్జీలు రూ. 65,460కి చేరుకున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి దేశీయ విమాన చార్జీలపై పరిమితి విధించింది. ఇండిగో సర్వీసులపై కేంద్రం 10 శాతం కోత పెట్టింది. అయితే ఇండిగోపై కేంద్రం తీసుకున్న చర్యలను ఏఎస్జీ చేతన్ శర్మ వివరించినప్పటికీ హైకోర్టు సంతృప్తి చెందలేదు. సంక్షోభం బద్దలైన తర్వాతే మీరు చర్యలు తీసుకున్నారు. మా ప్రశ్న ఇది కాదు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది. వచ్చేంతవరకు మీరు ఏం చేస్తున్నారు అని ధర్మాసనం కేంద్రాన్ని నిలదీసింది. విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన ప్రయాణికుల పట్ల ఇండిగో సిబ్బంది సక్రమంగా ప్రవర్తించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను 2026 జనవరి 22కి కోర్టు వాయిదా వేసింది.
ఇండిగో చైర్మన్ బహిరంగ క్షమాపణ
వేలాది విమానాల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణికులకు ఏర్పడిన ఇబ్బందులకు ఇండిగో చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ మెహతా బహిరంగ క్షమాపణ చెప్పారు. సంక్షోభం ఏర్పడిన వారం తర్వాత ఆయన ఈ మేరకు ఎనిమిది నిమిషాల వీడియోను విడుదల చేస్తూ పైలట్ల కొత్త విశ్రాంతి నియమాలను తప్పించుకోవడానికే తామీ సంక్షోభాన్ని సృష్టించామని వస్తున్న ఆరోపణలను ఖండించారు.