President Murmu | దేశం కోసం త్యాగాలు చేసిన వారికి సెల్యూట్ చేస్తున్నానని భారత రాష్ట్రపది ద్రౌపది ముర్ము అన్నారు. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె దేశ ప్రజలకు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ దేశం స్వాతంత్య్రం కోసం ప్రతి ఒక్క వర్గం పోరాటం చేసిందన్నారు. రాజ్యాంగ విలువలతో భారత్ ముందుకు వెళుతోందని చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు మానవ జాతి చూసిన అతిపెద్ద ఎన్నికల కసరత్తు అని పేర్కొన్నారు. విజయవంతంగా ఎన్నికలను నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులను బలోపేతం చేస్తుందన్నారు.
ఎన్నికలు శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రస్ఫుటం చేశాయని.. ఎన్నికలు సజావుగా నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలిపారు. ఎండ వేడిని తట్టుకొని ఓటర్లకు సహకారం అందించిన అధికారులు, భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో త్రివర్ణాన్ని ఆవిష్కరించడం ఉత్కంఠభరితమైన అనుభూతిని కలిగిస్తోందన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి దేశం సిద్ధమవుతున్నందుకు నేను సంతోషిస్తున్నానన్నారు. త్రివర్ణ రంగులజెండా ఎగురవేయడం ఎల్లప్పుడూ మన హృదయాలను పులకింపజేస్తుందన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. పోరాటంలో పాల్గొన్న వారి కలలు సాకారం కావాలన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్‌ను గుర్తు చేసుకున్నారు.
దేశవ్యాప్త ఉద్యమంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయన్నారు. గిరిజనుల్లో తిల్కా మాంఝీ, బిర్సా ముండా, లక్ష్మణ్ నాయక్ తదితరుల త్యాగాలకు ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయన్నారు. బిర్సా ముండా జన్మదినాన్ని దేశం జనజాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది ఆయన 150వ జయంతి వేడుకలు జాతీయ పునరుజ్జీవనానికి ఆయన చేసిన కృషిని మరింత గౌరవించే అవకాశంగా ఉంటుందని పేర్కొన్నారు. దేశం విభజన భయాందోళనలను గుర్తుచేసుకునే రోజు ఆగస్టు 14న విభజన్ విభిషిక స్మృతి దివస్‌ను పాటిస్తున్నదని.. దేశ విభజనతో లక్షలాది మంది వలసల వెళ్లారని, లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కేంద్రం సామాజిక న్యాయానికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని రాస్ట్రపతి పేర్కొన్నారు.