న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం అల్పాదాయ వర్గాలవారిపై తీవ్రంగా ఉంటున్నది. అదే సమయంలో సంపన్నులకు కార్పొరేట్ పన్ను రూపంలో వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం దక్కుతున్నది. అధిక ఆదాయ వర్గాలపై ఎక్కువ పన్నును విధించడమే పురోగామి విధానం అవుతుంది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలను మోది, పెద్దలను ముద్దాడుతున్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ)కి చెందిన సచ్చిదానంద ముఖర్జీ విడుదల చేసిన అధ్యయన నివేదిక మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఈ నివేదికలో దేశంలోని వినియోగదారులను మూడు వర్గాలుగా విభజించారు.
అట్టడుగు నుంచి 50 శాతం మంది, మధ్యలోని 30 శాతం మంది, అగ్ర భాగంలోని 20 శాతం మంది అనే మూడు వర్గాలుగా వీరిని పేర్కొన్నారు. వీరిపై జీఎస్టీ భారం ఎలా పడుతున్నదీ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగు 50 శాతం మంది, మధ్యలోని 30 శాతం మంది జీఎస్టీ భారంలో 31 శాతం చొప్పున భరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని అట్టడుగు 50 శాతం మందిపై 29 శాతం, మధ్యలోని 30 శాతం మందిపై 30 శాతం పన్ను భారం పడుతున్నది. అగ్ర భాగంలోని 20 శాతం మందిలో గ్రామీణులు మొత్తం జీఎస్టీ 37 శాతం చెల్లిస్తుండగా, పట్టణవాసులు 41 శాతం చెల్లిస్తున్నారు.
జీఎస్టీ విధానం ఓ మోస్తరుగా ప్రగతిశీలంగా ఉందని, దీనిలో ఉన్నత వర్గాల నుంచి సంపదను సమాజంలోని తక్కువ ఆదాయంగల వర్గాలవైపు మళ్లించే అవకాశం ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. జీఎస్టీ విధానాన్ని ప్రక్షాళన చేయాలనే చర్చ జరుగుతున్నపుడు ఈ అధ్యయనం జరిగింది. 12 శాతం పన్ను పరిధిలోకి వచ్చేవాటిని 5 శాతం లేదా 18 శాతం విభాగాల్లోకి విభజించి, 12 శాతం శ్లాబును రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ అధ్యయనం 390 వస్తువులను 9 కేటగిరీలుగా విభజించింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వ్యయం (ఎంపీసీఈ)లో 45 శాతం ‘మినహాయింపు’, ‘మినహాయింపు నుంచి 5 శాతం’ జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువులపైనేనని చేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ‘ఔట్ ఆఫ్ జీఎస్టీ’ కేటగిరీలో గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, పట్టణ ప్రాంతాల్లో 10 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చే ఐటమ్స్‌పై ఖర్చు చేస్తున్నారు.
గ్రామీణ వినియోగంలో 47 శాతం ఖర్చవుతున్నది జీఎస్టీ నుంచి మినహాయింపు పొందిన ఐటమ్స్పైన లేదా 5 శాతం వరకు జీఎస్టీ గల ఐటమ్స్పైన అని తెలిసింది. జీఎస్టీ నుంచి మినహాయింపు పొందే ఐటమ్స్ సంఖ్యను తగ్గించడం వల్ల గ్రామీణ ప్రాంతాలవారిపై పన్ను భారం పెరుగుతుందని ఈ అధ్యయనం హెచ్చరించింది. 5-12 శాతం శ్లాబులలోని ఐటమ్స్‌పై పన్నును పెంచడం వల్ల అల్పాదాయ వర్గాలపై పన్ను భారం పెరుగుతుందని హెచ్చరించింది.
కార్పొరేట్ కంపెనీలకు ప్రోత్సాహకాల రూపంలో రూ.98,999 కోట్ల కార్పొరేట్ పన్నును 2023-24లో వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. 2022-23లో రూ.88,109 కోట్లు; 2021-22లో రూ.96,892 కోట్లు వదులుకున్నట్లు మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు.
కార్పొరేట్ పన్ను రేట్లను 29 శాతానికి తగ్గిస్తూ 2016లో ఫైనాన్స్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. అప్పటి నుంచి కార్పొరేట్ పన్నుల వసూళ్లు తగ్గుతున్నాయి. 2017లో ఈ పన్నును 25 శాతానికి తగ్గించింది. జీఎస్టీ వంటి పరోక్ష పన్నులు పేదలపై పన్ను భారాన్ని పెంచుతాయి. అందువల్ల వీటిని తిరోగమన పన్నులని అంటారు. జీఎస్టీని 2017లో అమ లు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి మొత్తం పన్ను వసూళ్లలో పరోక్ష పన్నుల వాటా పెరుగుతుండగా, ప్రత్యక్ష పన్నులు, కార్పొరేట్ పన్నుల వాటా తగ్గుతున్నది.