Indian Railway | న్యూఢిల్లీ, జూన్ 4: దేశంలో రైలు ప్రయాణికుల భద్రత గాలిలో దీపంగా మారింది. కేంద్ర ప్రభుత్వ అలసత్వం, రైల్వే శాఖ నిర్లక్ష్యం.. వెరసి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒడిశాలో తాజా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖలో ప్రయాణికుల భద్రతపై ఎంతటి నిర్లక్ష్యం ఉన్నదో క్రమంగా వెలుగులోకి వస్తున్నది. 2022లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ‘డీరైల్మెంట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్’ పేరుతో కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని దేశ ప్రజల ముందు ఉంచింది. తాజాగా ఆ రిపోర్టులోని అంశాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ప్రయాణికుల భద్రత, మౌలిక వసతుల కల్పనకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏటా నిధులు తగ్గించటం ఒక ఎత్తయితే, ఇచ్చిన నిధులను కూడా వాడకుండా రైల్వేశాఖ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని కాగ్ తూర్పారబట్టింది. తన ప్రతి వైఫల్యంపై ఎదురుదాడికి దిగే కేంద్ర ప్రభుత్వం, ఒడిశా ప్రమాదంపై కూడా అదే పని మొదలుపెట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా రైలు ప్రమాదాలు జరిగాయని లెక్కలు బయటపెట్టి తన అలసత్వాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నది.
వ్యవస్థాగత లోపమే
దేశంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా అందుకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేస్తుంటారు. ఒడిశా ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ కూడా అదే ప్రకటన చేశారు. కానీ, ‘పట్టాలు తప్పిన రైల్వే’ పేరుతో కాగ్ ప్రచురించిన నివేదికలో దేశంలోని 90 శాతం ప్రమాదాలకు వ్యవస్థాగత వైఫల్యాలే కారణమని కుండబద్దలు కొట్టింది. రైల్వేల్లో కీలకమైన భద్రత విభాగంలో ఉద్యోగ ఖాళీల భర్తీని ప్రభుత్వం నిలిపేసిందని, ఔట్సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకొస్తున్నదని కాగ్ తెలిపింది. ఉద్యోగుల సంఖ్య తగినంత లేకపోవటంతో భద్రత విషయంలో రైల్వేశాఖ నాణ్యమైన సేవలు అందించలేకపోతున్నదని విమర్శించింది.
నాలుగేండ్లలో 2 వేల ప్రమాదాలు
దేశంలో 2017-21 మధ్య ఏకంగా 217 రైలు ప్రమాదాలు జరిగాయని కాగ్ తేల్చింది. ప్రయాణికుల మృతి, తీవ్రంగా గాయపడటం, రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లడం, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వంటి ప్రమాదాలను కాన్సీక్వెన్షియల్ ప్రమాదాలుగా పేర్కొంటారు.
భద్రతా నిధుల్లో కోత
రైల్వే శాఖ భద్రతా నిధిని ‘రాష్ట్రీయ రైల్ సంరక్ష్ కోష్’ (ఆర్ఆర్ఎస్కే) అని పిలుస్తారు. దీనిని 2017-18 ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. అయితే కేంద్ర ఆర్ఆర్ఎస్కేకు ఏటా నిధులు తగ్గిస్తూ వస్తున్నదని కాగ్ లెక్కలు చెప్తున్నాయి. రైల్వే ట్రాక్ల మార్పు కోసం 2018-19లో రూ.9,607.65 కోట్లు ఇవ్వగా, 2019-20లో ఆ మొత్తాన్ని రూ.7,417 కోట్లకు కుదించింది.
నిధుల ఖర్చులోనూ నిర్లక్ష్యమే
రైల్వే భద్రతకు ఉన్న కొద్దిపాటి నిధులను వాడుకోవటంలో కూడా రైల్వేశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని కాగ్ అక్షింతలు వేసింది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ జోన్లో 2019-20లో ట్రాక్ల మార్పిడికోసం ఇచ్చిన నిధుల్లో ఖర్చు చేసింది 3.01 శాతమే అంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థంచేసుకోవచ్చు. దాదాపు అన్ని జోన్లూ నిధులు ఖర్చుచేయలేక ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశాయని కాగ్ నివేదికలో పేర్కొన్నది. సరైన సమయంలో ట్రాక్లను మార్చకపోవటం వల్ల చోటుచేసుకొన్న ఘటనలే ఇటీవల 289 (26 శాతం) జరిగాయని కాగ్ తెలిపింది.
ఒడిశా రైలు ప్రమాద బాధితుల్లో తమ అయినవాళ్ల ఆచూకీ కోసం ప్రయాణికుల బంధువులు తీరని అన్వేషణ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రైల్వే శాఖ ప్రదర్శించిన మృతుల ఫొటోల్లో తమవారు కనిపిస్తారేమోనని ఇలా ఆవేదనాభరిత హృదయాలతో వెతుకుతున్నారు.
Pp