కొత్తగూడెం ప్రగతి మైదాన్, కోరుట్ల, నవంబర్ 30: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి చెందిన 37 మంది సభ్యులు పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను దంతేవాడ ఎస్పీ గౌరవ్రాయ్ ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై రూ.50 వేల నుంచి రూ.8 లక్షల వరకు మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.
తమ పెద్దనాన్న మావోయిస్ట్ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ లొంగిపోయేందుకు అవకాశం కల్పించాలని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన అతడి తమ్ముడి కూతురు సుమ సోషల్ మీడియా వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను వేడుకున్నది. ‘మా పెద్ద నాన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మావోయిస్టు పార్టీ చీఫ్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలు నిజమా? కాదా? అనేది మా కుటుంబానికి స్పష్టంగా తెలియడం లేదు. కానీ ప్రతిరోజూ వినిపించే ఈ సమాచారం మా కుటుంబాన్ని తీవ్ర కలిచివేతకు గురిచేస్తోంది’ అని ట్వీట్ చేసింది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, దయచేసి ఆయనను కోర్టులో హాజరుపరచేలా చూడాలని లేదా లొంగిపోవడానికి అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నట్లు తెలిపింది.