హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు అధికారికంగా కొత్త ఓనర్ల చేతికి మారుతున్నాయి. వీటితో పాటు అనధికారికంగా ఈ ఏడాది కొత్తగా 40 వేల బెల్టు దుకాణాలు రాబోతున్నట్టు అంచనా. ఇప్పటికే గ్రామాల్లో వీధివీధికి మనుగడలో ఉన్న పాత బెల్టు దుకాణాలను కలుపుకుంటే 1.45 లక్షల బెల్టు దుకాణాలు గ్రామాల్లో మద్యం ఏరులను పారించనున్నట్టు సమాచారం. తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతున్నదని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఇటీవల వ్యాఖ్యానించింది. నివాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.