మణుగూరు టౌన్, నవంబర్ 30 : సినిమాల్లో జరిగినట్లే చేసి చూపించారు మణుగూరు ప్రభుత్వ దవాఖాన వైద్యు లు.. అప్పుడే పుట్టిన నవజాత శిశువు చనిపోయినప్పటికీ మెరుగైన వైద్యం కోసమంటూ ఆక్సిజన్ పెట్టి భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వివరాల్లోకెళ్తే.. ఆదివారం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వంద పడకల దవాఖానలో పినపాక మండలానికి చెందిన తోలెం రవికుమార్ భార్య అరుణ పురిటినొప్పులతో చేరింది. వైద్యులు చాలా సమయం వేచిచూసి సాధారణ ప్రసవం చేయడంతో కడుపులో ఉన్న మగబిడ్డ మృతిచెందింది. ఈ విషయం గోప్యంగా ఉంచి శిశువుకు ఆక్సిజన్ పెట్టి భద్రాచలం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యు లు శిశువు మృతిచెంది చాలా సమయం అయిందని వెల్లడించడంతో కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మణుగూరు దవాఖాన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.
ముళ్ల పొదల్లో ఆడ శిశువు లభ్యం
నారాయణపేట రూరల్, నవంబర్ 30 :నారాయణపేట మండలం అప్పక్‌పల్లి శివారు కాటన్‌మిల్ సమీపంలోని ముళ్ల పొదల్లో ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఆదివారం పాప ఏడుపు విన్న స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి నవజాత శిశువును చూసి చలించిపోయారు. గాయాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో టెక్నీషియన్ శిరీష అంబులెన్స్‌లోనే ఆక్సిజన్ అందించి ప్రథమ చికిత్స చేసి జిల్లా దవాఖానకు తరలించారు. డాక్టర్ మహేందర్ పరీక్షించి శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పారు.