వరంగల్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జయశంకర్ భూపాలపల్లి: కాంగ్రెస్ పాలనలో అడవులను తెగనరుకుతు న్న దుండగులు పోడును విస్తరించుకుంటూ పోతున్నారు. దశాబ్దాల పోడుకు రెండేండ్ల క్రితం కేసీఆర్ సర్కార్ చరమగీతం పాడితే రేవంత్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో అటవీ పోడుకాటుకు బలైపోతున్నది. అటవీ ప్రాంతాల్లో కాం గ్రెస్ నాయకుల విచ్చలవిడితనానికి జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో నెలకొన్న దుస్థితే నిదర్శమని పర్యావరణ ప్రేమికులు చెప్తున్నా రు. ఈ రెండేండ్లలో ఒక్క భూపాలపల్లి జిల్లాలోనే మూడువేల ఎకరాల అడవులు పోడుభూములుగా మారినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అడవులను నరికి చదును చేసి అమ్మడాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్డుకునేందుకు అటవీ, పోలీసు శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ‘పై నుంచి వచ్చే ఒత్తిళ్ల’తో విఫలమవుతున్నాయనే వాదన వినిపిస్తున్నది.
అటవీ భూమి ఎకరానికి లక్ష
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గం పరిధిలో సరిహద్దు మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత అడవిని కొట్టి, ట్రాక్టర్‌తో చదును చేసి విక్రయిస్తూ అక్రమ సంపాదనకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భూమిని ఎకరానికి లక్షకు అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పలిమెల, మహాముత్తారం, భూపాలపల్లి మండంలోని ఆజంనగర్ అటవీ ప్రాంతాల్లో యథేచ్ఛగా అడవిని నరుకుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మునుపెన్నడూ లేనివిధంగా జిల్లాలో 2,744 ఎకరాల మేర అటవీ భూమి నరికివేతకు గురైందని అధికారులు అంచనా వేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతల కనుసన్నల్లోనే పోడు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
సరిహద్దులో పోడు డాన్
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దును ఆనుకొని జయశంకర్-భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత అటవీభూమిని పొతం పట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపణలు మిన్నంటుతున్నాయి. స్థానికంగా అందరూ సదరు నేతను పోడు భూముల డాన్‌గా పిలుస్తారనే ప్రచారం సాగుతున్నది. పోలీసులు, అటవీ అధికారులు ఎవ రు తన దరికి వచ్చినా లెక్కచేయరని అంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తన మందబలాన్ని ఉసిగొలిపి భౌతికదాడులు చేస్తారని చెప్తున్నా రు. ఎవరైనా ఫిర్యాదు చేస్తారని తెలియగానే తనే ముందుగా వారిపై ‘అట్రాసిటీ’ అస్ర్తాన్ని ప్రయోగిస్తారని, ఆ భయంతో ఎవరూ ఆ డాన్ జోలికి వెళ్లరని చెప్పుకుంటున్నారు.
ఏడాదికి వెయ్యి ఎకరాల చొప్పున
అటవీశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1,69,461.26 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీభూమి ఉంది. అయితే, ఇది కేవలం రికార్డులకు పరిమితమైన లెక్కలేనని అధికారులు చెప్తున్నారు. దశాబ్దాల తరబడి పోడుకు గురైన అటవీభూములను కేసీఆర్ సర్కార్ అర్హులను గుర్తించి 2023 జూన్‌లో పంపిణీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 3,250 మంది రైతులకు 8,088 ఎకరాల భూమికి పట్టాలు పంపిణీ చేసింది. అనేక దశాబ్దాలపాటు అటవీ ప్రాంతంలోని గిరిజనులు తమ జీవనం కోసం సాగుచేసుకున్నది కేవలం 8 వేల ఎకరాలే అయితే, రేవంత్‌రెడ్డి సర్కార్ కొలువుదీరిన కేవలం రెండేండ్లకాలంలోనే దాదాపు 3వేల ఎకరాల అటవీభూమి నరికివేతకు గురైంది. ఈ స్థాయిలో అటవీహననం చరిత్రలో మునుపెన్నడూ జరగలేదని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
నాడు పక్కాగా ఆక్రమణల నిరోధన
‘ఇక భవిష్యత్తులో ఇంచు భూమి కూడా ఆక్రమణకు గురికాకూడదు. ఒకవేళ గురైతే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాడు కేసీఆర్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. పాలిగన్ సాంకేతిక సహాయంతో పకడ్బందీగా పోడుభూముల పట్టా (అటవీ భూ యాజమాన్య హకు ప్రతాలు)ను రూపొందించి పంపిణీ చేశారు.
గుర్తిస్తున్నాం…చర్యలు తీసుకుంటాం
సాధ్యమైనమేరకు పోడు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కానీ, కొన్నిచోట్ల కొందరు బలప్రయోగం చేస్తున్నారు. అయినా, వెరవకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో ఒక మండలానికి చెందిన వ్యక్తిపై నిఘాపెట్టాం. ఒకసారి పోలీస్ ఫోర్స్‌తో వెళ్తే పోలీసులు, అటవీ అధికారులు అన్నతేడా లేకుండా దుర్భాషలాడుతూ పారిపోయాడు. ఆ వ్యక్తి చేయించిన పోడుపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ కొత్త గా పోడు జరిగిందో గుర్తిస్తున్నాం. అలా గే ఆజంనగర్, మహాముత్తారం అడవుల్లోనూ పోడు జరుగుతున్నట్టు సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు మా పరిధిలో పోడును అడ్డుకుంటూనే ఉన్నాం.
-నవీన్‌కుమార్, డీఎఫ్‌వో