Operation Sindoor | న్యూఢిల్లీ, మే 8: పాకిస్థాన్ రెండోమారు గురువారం సాయంత్రం భారత్‌పై దుస్సాహసానికి ఒడిగట్టింది. రాత్రి 9.00 గంటల అనంతరం జమ్ముతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు తెగబడింది. సరిహద్దు ఆవలి నుంచి పలు క్షిపణులను ప్రయోగించింది. అయితే వెంటనే స్పందించిన భారత సైన్యం దీటుగా జవాబు చెప్పింది. పాక్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లను కూల్చివేసింది. ఎస్-400 రక్షణ వ్యవస్థతో క్షిపణులను గగనతలంలోనే అడ్డుకొని ధ్వంసం చేసింది. ఒక ఎఫ్-16, రెండు జేఎఫ్-17 యుద్ధ విమానాలను కూల్చివేసింది. పాకిస్థాన్‌కు చెందిన గగనతల హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. దీంతో గంటన్నర వ్యవధిలోనే పాక్ తోకముడిచింది. పాక్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టామని, భారత్‌కు ఎటువంటి నష్టం జరుగలేదని సైనిక దళాలు ప్రకటించాయి. కొద్దిసేపు సహనం ప్రదర్శించిన భారత్ ఆ తరువాత పాక్‌లోని లాహోర్, సియాల్కోట్పై దాడికి దిగింది.
పాక్ ఆకస్మిక సైనిక చర్యతో భారత్ ముందుజాగ్రత్త చర్యగా పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లోని పలు ప్రాంతాలలో బ్లాక్అవుట్ ప్రకటించింది. ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ను అర్ధాంతరంగా రద్దు చేసిన అధికారులు, స్టేడియంలోని ప్రేక్షకులను వెంటనే ఖాళీచేసి వెళ్లిపోవాలని సూచించారు. పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హుటాహుటిన ప్రధాని ఇంటికి బయలుదేరారు. ఈసారి పశ్చిమ భారతాన్ని లక్ష్యంగా చేసుకున్న పాక్ ఆ వైపు సరిహద్దు వెంట ఒకేసారి భారీ సంఖ్యలో డ్రోన్లను, క్షిపణులను ప్రయోగించింది. పంజాబ్‌లోని ఉదంపూర్, పఠాన్‌కోట్, ఎయిర్‌బేస్‌లు, రాజస్థాన్‌లోని జైసల్మేర్, గుజరాత్‌లోని సర్‌క్రీక్ వద్ద దాడికి వచ్చిన డ్రోన్లను భారత దళాలు కూల్చివేశాయి. జమ్ములోనే ఎనిమిది డ్రోన్లను కూల్చివేశాయి. వాటి రాకను రాడార్ వ్యవస్థ ముందే పసిగట్టడంతో అప్రమత్తమైన ఎస్-400 రక్షణ వ్యవస్థ డ్రోన్లను, క్షిపణులను మధ్యలోనే అడ్డుకొని ఆకాశంలోనే ధ్వంసం చేసింది. పాక్ కవ్వింపుతో జమ్ము, కుప్వారా, చండీగఢ్, మొహాలీ నగరాల్లో ఎమర్జెన్సీ సైరన్లు మోగాయి.
మూడు యుద్ధ విమానాల కూల్చివేత
భారత సాయుధ దళాలు జమ్ముపై దాడికి వచ్చిన పాకిస్థాన్‌కు చెందిన మూడు ఫైటర్‌జెట్ విమానాలను కూల్చివేశాయి. వీటిలో ఒకటి అమెరికా తయారీ ఎఫ్-16 కాగా, రెండు జేఎఫ్-17 విమానాలున్నాయి. ఎఫ్-16 పైలట్ బందీగా చిక్కినట్టు తెలిసింది. జమ్ముకశ్మీర్‌లోని జమ్ము, ఆర్‌ఎస్‌పురా, చనీ హిమత్ వాటి పరిసర ప్రాంతాలలో సైనిక, పౌర నివాసాలు లక్ష్యంగా పాక్ దాడికి ప్రయత్నించింది. అయితే భారత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు ఎస్-400, ఆకాశ్ వ్యవస్థలు విజయవంతంగా పాక్ మిస్సైళ్లను, డ్రోన్లను ఎదుర్కొని కూల్చివేశాయి. జమ్ముపై దాడికి వచ్చిన 8 డ్రోన్లు లేదా క్షిపణులను కూల్చివేసినట్టు సైనికవర్గాలు ప్రకటించాయి. పాక్‌లోని సర్గోధా నుంచి జమ్ము వైపు వచ్చిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూడా కూల్చివేసినట్టు తెలిపాయి.