Operation Sindoor | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించి, మిస్సైళ్లతో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. మొత్తం తొమ్మిది స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేపట్టింది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా.. పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి అర్ధరాత్రి భారత సైన్యం ఎక్స్‌లో పోస్టు చేసింది. కోట్లీ, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులకు పాల్పడింది. మెరుపుదాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ తేరుకునేలోపే ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తి చేశారు.
పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ ఉదయం 10 గంటలకు రక్షణ శాఖ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక భారత్‌లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఆపరేషన్ సిందూర్‌ను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భారత్ మాతాకీ జై అంటూ రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. 1971 తర్వాత తొలిసారి పాక్ భూభాగంలో భారత్ దాడులు జరిపింది.
⚡️Bhawalpur missile strike visuals. People evacuated from the area by Pakistani authorities#OperationSindoor #PahalgamTerroristAttack #PakistanArmyBehindPahalgam pic.twitter.com/0gIKVtXLFp
— 🪷 Santanu Mallick 🇮🇳 (@Santanu_100) May 6, 2025