న్యూఢిల్లీ : త్రివిధ దళాల ప్రక్షాళనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను భారత వాయు సేన (ఐఏఎఫ్) చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఏపీ సింగ్ ప్రశ్నించారు. మధ్య ప్రదేశ్‌లోని మహౌలో మంగళవారం జరిగిన ఓ సెమినార్లో సింగ్ మాట్లాడుతూ, ఈ సమయంలో అన్నిటినీ చెడగొట్టి, ఒకే నిర్మాణంగా చేయడం సరైనది కాకపోవచ్చునని హెచ్చరించారు. ఇతర దేశాల తరహాలో థియేటర్ కమాండ్స్‌ను తీసుకురానక్కర్లేదన్నారు.
కింది స్థాయిలో మరొక నిర్మాణం వాస్తవానికి అవసరం లేదని చెప్పారు. ప్రధాని మోదీ సైన్యాన్ని థియేటర్ కమాండ్స్‌గా పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధ నౌకలు, గస్తీ విమానాలు, సైనికులు, యుద్ధ విమానాలు అందుబాటులో ఉండేలా చేయడానికి థియేటర్ కమాండ్స్ ఉపయోగపడతాయి. గ్రౌండ్ రాడార్ నెట్వర్క్ గల ఇతర క్షిపణి, గన్ రెజిమెంట్స్తో కలిసి ఈ కమాండ్స్ పని చేస్తాయి. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది.
భారత సైన్యం, నావికా దళం, వాయు సేన చాలా వరకు శిక్షణ, ఆయుధాలు, పరికరాలు, ప్రణాళిక వంటివాటిలో వేర్వేరుగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలో సింగ్ మాట్లాడుతూ, అత్యున్నత స్థాయిలో ఉమ్మడి ప్రణాళిక, సమన్వయం అవసరమని తాను భావిస్తున్నానని చెప్పారు. పునర్వ్యవస్థీకరణ వల్ల కనీసం నాలుగు థియేటర్ కమాండ్స్‌ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. పాకిస్థాన్‌ను గమనించేందుకు పశ్చిమ దిశలో ఒకటి, చైనాపై దృష్టి పెట్టేందుకు తూర్పువైపున ఒకటి, హిందూ మహాసముద్రం ప్రాంతం కోసం మారిటైమ్ కమాండ్, చివరిగా, గగనతల రక్షణ కమాండ్ ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
ఉత్తర ప్రాంతమైన జమ్ముకశ్మీరును ప్రస్తుతానికి యథాతథంగా ఉంచుతారని మిలిటరీ అధికారులు తెలిపారు. త్రివిధ దళాలు భూమి, సముద్రం, గగనతలాల్లో నిరాఘాటంగా కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పించడం కోసం ఈ విధానాన్ని రూపొందించారు. ప్రతి దేశానికి తనకంటూ ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయని సింగ్ చెప్పారు. భారత దేశం తన అవసరాలను మూల్యాంకన చేయాలన్నారు. లేని పక్షంలో తప్పు జరుగుతుందని హెచ్చరించారు.