Akhilesh Yadav | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఫైనల్స్‌లో భారత్ ఓటమిని క్రీడా అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్ల ముందే కప్పు చేజారడంతో భారత జట్టు సహా అభిమానులు, పలువురు ప్రముఖులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఫైనల్స్‌లో భారత్ ఓటమిపై సమాజ్ వాదీ పార్టీ అధినేత (Samajwadi Party Chief) అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ (Ahmedabad)లో కాకుండా లక్నో (Lucknow)లో ఫైనల్స్ జరిగి ఉంటే భారత జట్టు గెలిచేదంటూ చెప్పుకొచ్చారు.
‘ప్రపంచకప్ ఫైనల్స్ మ్యాచ్ గుజరాత్లో కాకుండా లక్నోలో జరిగిఉంటే.. వారికి (టీమ్ఇండియా జట్టు) మంచి ఆశీర్వాదం లభించేది. మహావిష్ణువు, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సులు లభించేవి. దీంతో మన జట్టు కచ్చితంగా కప్పు గెలిచేది’ అంటూ చెప్పుకొచ్చారు. గతంలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం లక్నోలో ఈ స్టేడియాన్ని నిర్మించి ఎకానాగా (Ekana Stadium) పేరు పెట్టింది. మహా విష్ణువుకు ఉన్న పేర్లలో ఎకానా ఒకటి. 50,000 మంది సీటింగ్ కెపాసిటీతో ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా పేరు గాంచింది. అయితే, యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత స్టేడియం పేరును అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంగా మార్చారు.
వరల్డ్ కప్ లీగ్ దశలో టీమిండియా తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. కీలకమైన సెమీస్‌లోనూ 2019 రన్నరప్ న్యూజిలాండ్‌ను 70 పరుగులతో చిత్తు చేయడంతో ఈసారి ట్రోఫీ మనదే అనుకున్నారంతా. అయితే.. దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్ చేరడంతో ట్రోఫీ దక్కేనా? అని మనసులో సందేహం. అనుకున్నట్టుగానే కంగారూల చేతిలో రోహిత్ సేన ఓటమిపాలైంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ తడబడింది. ఆసీస్ పేసర్ల విజృంభణతో 240 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఆదిలోనే మూడు కీలక వికెట్లు తీసినప్పటికీ ట్రావిస్ హెడ్(137), మార్నస్ లబూషేన్(58 నాటౌట్) గోడలా నిలబడ్డారు. దాంతో, 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆసీస్ ఆరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
Also Read..
Air pollution | ఢిల్లీలో మరింత తీవ్రమైన వాయు కాలుష్యం.. Video
Etamatam | ఎంత బాగా చెప్పారు.. మా తల్లే !.. రేణుకా చౌదరిపై ఫన్టాస్టిక్ పంచ్