Borla Ram Reddy | ఉమ్మడి రాష్ట్రంలో చీకటి రాజ్యమేలింది. కరువు తాండవం చేసింది. నేలతల్లిని గోసపెట్టి తూట్లు పొడిచినా.. చుక్కనీరు పడకపోవు. సన్నకారు రైతులు దిక్కు దివాణా లేకుండా వలసపోతే.. పాతిక ఎకరాల ఆసాములు కూడా అప్పుల్లో కూరుకుపోయిన్రు. పట్టుబట్టి బోర్లు వేసినా.. జల పుట్టిందీ లేదు, పాలకులకు జాలి కలిగిందీ లేదు. అలాంటి కల్లోల కాలానికి సాక్షి నల్లగొండ జిల్లా రైతు బైరెడ్డి రాంరెడ్డి. వంద బోర్లు వేసిన 30 ఎకరాల భూస్వామి ‘బోర్ల రాంరెడ్డి’గా మిగిలిపోయాడు. ఇన్ని బోర్లు వేసినా తన పంటలను కాపాడుకోలేకపోయాడు. అదే రాంరెడ్డి.. తెలంగాణ వచ్చాక ‘మా బోర్లు పొంగుతున్నయ్’ అంటున్నాడు.
‘నాడు నీళ్ల కోసం, కరెంటు కోసం గోస తీరింది. సమైక్య పాలనలో కరెంట్ వస్తే ఆశ్చర్యం.. ఇప్పుడు పోతే ఆశ్చర్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రైతులు ధీమాగా ఉన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, పుష్కలంగా నీళ్లు వస్తుండటంతో వ్యవసాయం పండుగలా మారింది’ అంటున్నారు అదే బోర్ల రాంరెడ్డి. గతంలో సాగునీరు, కరెంటు కోసం పడ్డ తిప్పలు.. నేటి పరిస్థితులపై ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే
నా కథ తెల్వనోడు తెలంగాణల లేడనుకుంటా! ఎన్నిసార్లు చెప్పినా నాకూ బోరు కొట్టది.. మీకూ బోరు కొట్టది. వంద బోర్లు వేసిన చరిత్ర కదా నాది! మాది నల్లగొండ మండలంలోని ముషంపల్లి. నా అసలు పేరు బైరెడ్డి రాంరెడ్డి. నాకు 30 ఎకరాల భూమి ఉన్నది. 1990ల కాలంలో 20 ఎకరాల్లో బత్తాయి తోట వేసిన. నీళ్ల సౌలత్ లేక, కరెంట్ సక్కగ రాక 10 ఎకరాలు ఉట్టిగనే పడావు పెట్టిన. అప్పట్లో విపరీతమైన కరువు వచ్చింది. బత్తాయి చెట్లు ఎండిపోవట్టినయ్. ఎదిగిన కొడుకు సచ్చిపోతే ఎంత బాధ అయితదో.. ఏండ్లకేండ్లు సాదిన చెట్లు ఎండిపోతుంటే అంతే బాధ కలుగుతది. తోటలకు పోయి ఏడ్చేది. చేసేదేమీ లేక అప్పులు తెచ్చి మరీ బోర్లు వేసిన. అన్ని బోర్లు దాదాపు 500 అడుగుల లోతు వరకు దించినా.. సుక్క నీళ్లు రాలే. గ్రామంలో అందరం వేసినం కానీ.. నేను మాత్రం 100కు పైగా వేసిన. అయినా ఫలితం రాలే. చుక్క నీళ్లు పడలే! చివరికి ఎట్లయిందంటే.. మా ఊర్లకు బోరుబండి రాంగనే మా ఇంటికే వచ్చిందనేటోళ్లు. అట్లా నా పేరు కాస్తా బోర్ల రాంరెడ్డిగా మారింది.
మా ఊర్ల కిస్మత్ చక్కగ లేదని మా పక్క ఊరు వెలుగుపల్లిలో ఐదారు బోర్లు వేసిన. జరన్ని నీళ్లు పడ్డయ్. అక్కడి నుంచి ట్యాంకర్లో నీళ్లు తెచ్చి.. బత్తాయి చెట్లను కాపాడుకునే ప్రయత్నం చేసిన. ట్యాంకర్ల మంచినీళ్లు తెచ్చుడు ముచ్చట ఎరక గని, ఇట్ల పొలానికి నీళ్లు పట్టనీకి కూడా ట్యాంకులు వాడినా అంటే అప్పుడు ఎంత దరిద్రం ఉండేటిదో ఊహించుకోవచ్చు. నీళ్లు వడ్డ బోర్లు అయినా సక్కదనం ఉండేటియా అంటే అదీ లేదు! కరెంటు ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వకపోవు. రాత్రంతా పొలం దగ్గర్నే పండుకునేది. కరెంటు వచ్చినా.. గంటసేపు ఉండకపోవు. పాతికేండ్లు ఇదే సావు!
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు నా తిప్పలు తెలిసినయ్. ‘మా తెలంగాణ రైతు ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటని’.. ఆ రోజుల్లోనే నా చరిత్రను రికార్డు చేసి అప్పటి ప్రభుత్వాల ముందు పెట్టిండు. నాపై డాక్యుమెంట్ చేయించిండు. ‘సాగునీళ్లు సక్కగ ఇయ్యక మా రైతును గోస పుచ్చుకుంటున్నరు.. ఒక రైతు వంద బోర్లు వేయడమేంటి? సమైక్య పాలకులు మా నీళ్లు దోచుకుంటున్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మా వాటా మాకు ఇవ్వకుండా గుంజుకుపోవడం వల్లే మా రైతులకు ఇన్ని తిప్పలు’ అని కేసీఆర్ అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసిండు. సమైక్య పాలనలో తెలంగాణకు వాటా ప్రకారం నీళ్లు ఎన్నడూ రాలే. ఏనాడూ రెండు పంటల కోసం లెఫ్ట్ కెనాల్‌కు నీళ్లు ఇచ్చింది లేదు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని గుర్తించి అప్పటి నుంచి కేసీఆర్ నిర్వహించిన ప్రతి సమావేశం, పాదయాత్ర, సభల్లో నేను పాల్గొన్నా. ఆయన వెంట నడిచా.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు ఉద్యమకారుడే ముఖ్యమంత్రి కావడంతో సాగర్ జలాల్లో మన వాటా మనకు దక్కింది. మన నీళ్లు మనకు వస్తే బీడు భూములన్నీ పచ్చని హారంగా మారుతాయని సంకల్పించిన కేసీఆర్ పుష్కలంగా నీళ్లు తెచ్చిండు. కాలం కూడా మంచిగైతుంది. హైదరాబాద్ తాగునీరు, పొలాలకు సాగునీరు పోను పుష్కలంగా నీళ్లు మిగులుతున్నయ్. నీళ్ల కోసం దేవులాట లేకుండా పోయింది. తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటయని కొందరన్నరు. ఆర్నెల్లు జర్రంత తిప్పలైంది. తర్వాత కరెంటు కష్టంలేకుండా మాయమైంది. అప్పట్లో కరెంటు వస్తే వింత.. ఇప్పుడు పోతే వింత! మాకు (రైతులకు) కరెంటు ఇయ్యనీకి ఆ మహానుభావుడు.. ఏం తిప్పలపడ్డడో ఏమో! అధికారులకు ఏం చెప్పిండో కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు నెలల్లోనే కరెంటు సమస్య పోయింది. గిప్పుడు కాంగ్రెసోళ్లు చెప్తున్నట్టు మూడు గంటలు కాదు.. 24 గంటలు కరెంటు ఇస్తున్నడు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన ఇనాం ఇది.
రైతుకు కావాల్సింది రెండే.. సాగునీరు, కరెంటు. ఈ రెండు సమృద్ధిగా ఉన్నాయంటే మాకు ధీమా. ఇయ్యాల రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయం అందుతున్నది. రైతులు కాలం చేస్తే.. ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా 10 రోజుల్లోనే రూ.5 లక్షల బీమా వస్తున్నది. ఇంకేం కావాలి రైతులకు. గ్రామగ్రామాన ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నయి. ధాన్యం పైసలు 48 గంటల్లోనే రైతుల ఖాతాల జమయితున్నయి. నా చిన్నతనం నుంచి గిట్ల ఎన్నడూ చూడలే! నీళ్లు ఇచ్చిండు, విత్తనాలు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, కరెంటు ఇచ్చిండు. ఇప్పుడు 15 బోర్లు ఫుల్లుగా పోస్తున్నాయి. 10 ఎకరాల్లో బత్తాయి తోట ఉంది. 20 ఎకరాల్లో వరి పొలం వేసిన. సీఎం కేసీఆర్ పాలనలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. కేసీఆర్ పాలన రైతులకు ధీమా కల్పిస్తున్నది. కాంగ్రెసోళ్లు వస్తే మళ్లీ ఖతమే! కరెంటు ఆగమైతది. రైతులు బద్నాం అయితరు. కేసీఆరే వస్తే.. మా రైతుల బతుకులు మరింత మంచిగైతయ్!!