గోవా: యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) ఇవాళ సందర్శించారు. అక్కడ ఆయన నేవీ సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. చాలా తక్కువ సమయంలోనే పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను, వాళ్ల ఉద్దేశాలను ధ్వంసం చేశామన్నారు. మనం ఎంతో శక్తివంతమైన దాడి చేశామని, ఆ దాడుల్ని విరమించుకునేలా చేయాలని పాకిస్థాన్ ప్రపంచ దేశాలను వేడుకున్నదని రాజ్‌నాథ్ తెలిపారు. మన సైనిక దళాలు ఎంతో వేగంగా, గాఢాంగా, స్పష్టమైన దాడులు చేశాయని, అసాధారణ రీతిలో ఆ దాడులు జరిగినట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులకే కాదు, వాళ్లను పెంచి పోషించే వాళ్లకు కూడా స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలిపారు.
సమగ్రమైన రీతిలో సాగిన ఆపరేషన్‌లో భారతీయ నౌకాదళ పాత్ర కూడా అద్భుతమైందని మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పాకిస్థానీ నేలపై ఉన్న ఉగ్ర స్థావరాలను ఐఏఎఫ్ ధ్వంసం చేస్తే, ఆరేబియా సముద్రంలో ఉన్న భారత యుద్ధ నౌకలు.. పాకిస్థానీ నేవీని తీరానికి పరిమితం చేశాయన్నారు. ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు అని, ఉగ్రవాదంపై అది మూకుమ్మడి దాడి అని రాజ్‌నాథ్ చెప్పారు. పాక్ ఉగ్రవాదులను నాశనం చేసేందుకు ఏ పద్ధతినైనా అనుసరిస్తామని, పాక్ ఊహించలేని పద్ధతుల్లో ఆ చర్యలు ఉంటాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాకిస్థాన్ ఆడుతున్న ప్రమాదకర ఉగ్రవాద ఆట ఇప్పుడు ముగిసిందన్నారు.