TikTok | చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) సేవలు భారత్‌లో మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ (Chinas TikTok back in India) గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై కేంద్రం తాజాగా స్పందించింది. టిక్‌టాక్ రీఎంట్రీ వార్తలను తోసిపుచ్చింది.
ఈ మేరకు టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసే ప్రణాళిక పరిశీలనలో లేదని కేంద్ర ఐటీ, సమాచార, ప్రసార శాఖ మంత్రి (IT minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) స్పష్టం చేశారు. మనీకంట్రోల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ విషయంపై ప్రభుత్వంలో ఎలాంటి చర్చలూ జరగలేదని వెల్లడించారు. భారత్‌లో టిక్‌టాక్‌పై విధించిన నిషేధం ఎత్తివేతకు సంబంధించిన ఎటువంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు.
భారతీయ, చైనా సైనిక బలగాల మధ్య గల్వాన్ ఘర్షణ తర్వాత భద్రతా కారణాలు చూపుతూ భారత ప్రభుత్వం 2020లో టిక్‌టాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. టిక్ టాక్‌తోపాటు వందలాది చైనీస్ గేమింగ్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత కూడా భారత్‌లో ఏదోవిధంగా కొనసాగేందుకు శాయశక్తులా ప్రయత్నించిన టిక్ టాక్ కంపెనీ ఎట్టకేలకు 2023 ఫిబ్రవరి 28న మూతపడింది. అప్పటి నుంచి భారత్‌లో అందుబాటులో లేదు. అయితే, ట్రంప్ సుంకాల మోతతో అమెరికా-భారత్ మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారతీయ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించినప్పటి నుంచి భారత్, చైనా (India-China) మధ్య సంబంధాలలో పురోగతి కనిపిస్తోంది.
భారత్‌కు ఎరువులు, అరుదైన ఖనిజాలు, సొరంగాలను తవ్వే మిషన్ల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు చైనా ఇటీవలే ప్రకటించింది. ఆ తర్వాత టియాంజిన్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగిన షాంఘై సహకార సంస్థల(ఎస్సీఓ) సదస్సుకు ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ పరిణామాలతో మళ్లీ భారత్‌లోకి అడుగుపెట్టబోతోందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాయి కూడా. ఇప్పుడు ఐటీ, సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా స్పష్టతనిచ్చారు.
Also Read..
WhatsApp Down | వాట్సాప్ సేవల్లో అంతరాయం.. సోషల్ మీడియా వేదికగా యూజర్లు ఫిర్యాదులు
Ganesh Visarjan | గణేశ్ నిమజ్జనంలో దొంగల చేతివాటం.. 100కిపైగా ఫోన్లు, బంగారు ఆభరణాలు చోరీ
Restaurant Staff | హోటల్ సిబ్బంది, కస్టమర్ల మధ్య ఘర్షణ.. షాకింగ్ వీడియో