బెంగళూరు : ఇటీవల జరిగిన అసెంబ్లీ, గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల సంఘం సహకారంతో బీజేపీ ఓట్ల మోసానికి పాల్పడి పలుచోట్ల విజయం సాధించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. దానికి ఉదాహరణగా కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో చిన్న రూములో 80 మంది ఓటర్లు నమోదైన విషయాన్ని ఆయన వెల్లడించారు. దీనిలో నిజానిజాలను నిర్ధారించడానికి ‘ఇండియా టుడే’ రంగంలోకి దిగి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ఐటీ కారిడార్‌లో ఉన్న ఇంటికి చేరుకుని వివరాలు సేకరించింది.
మునిరెడ్డి గార్డెన్‌లోని 35వ ఇంటి నెంబర్‌గా ఉన్న ఆ ఇంటిపై 80 మంది ఓటర్లు నమోదైన విషయం నిజమేనని నిర్ధారించింది. ఇంతకీ ఆ ఇల్లు 10-15 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. ప్రస్తుతం అక్కడ పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపాంకర్ అనే ఫుడ్ డెలివరీ బాయ్ నివసిస్తున్నాడు. అయితే ఓటరు లిస్టులో పేర్ల గురించి తనకేమీ తెలియదని, తనకైతే ఓటు లేదని తెలిపాడు. దీనిపై ఆ ఇంటి యజమాని జయరాం రెడ్డిని ప్రశ్నించగా, బీజేపీతో తనకు సంబంధాలున్నాయని చెప్పిన ఆయన తర్వాత మాట మార్చి కేవలం ఆ పార్టీ అభిమానిని మాత్రమేనని తెలిపాడు. చాలా ఏండ్లుగా తన ఇంట్లో అనేక మంది నివసించి తరచూ ఖాళీ చేసి వెళ్లిపోతుండే వారని, బహుశా వారు ఉన్నప్పుడు తమ చిరునామాతో ఓటర్లుగా నమోదు చేసుకుని ఉండవచ్చునని తెలిపాడు.
ఈసీ, ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ ఎన్నికల్లో పెద్దయెత్తున అవకతవకలకు పాల్పడ్డారని, ఓటింగ్, ఇతర ప్రక్రియలను తారుమారు చేయడం ద్వారా మోదీ మూడోసారి ప్రధానిగా అధికారం చేపట్టారని ఆయన విమర్శించారు. దానిపై సంతకం చేయండి తమపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ.. ఓట్ల చోరీ ఆరోపణలు నిజమని అనుకుంటే ఆ మేరకు ఒక డిక్లరేషన్‌పై సంతకం చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది.