ISRO | చంద్రుడిపైకి 2040 నాటికి వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు. జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతరిక్షరంగంలో భారత్ దూసుకుపోతుందన్న ఆయన.. అంతరిక్షరంగంపై చేస్తున్న ప్రతి రూపాయి ఖర్చుకు రూ.2.52 ఆదాయం పొందుతున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.31వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. రాబోయే 15 ఏళ్లలో ఇస్రో చేపట్టనున్న ప్రయోగాల కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు.
2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలని ఇస్రో లక్ష్యమన్నారు. ఇందు కోసం 2028లో తొలి మాడ్యూల్‌ని నింగిలోకి పంపిస్తామని.. 2035 నాటికి పూర్తి స్థాయిలో స్పేస్ స్టేషన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. భారత్ వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే నాటికి చంద్రుడిపై కాలు మోపాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు చంద్రయాన్-4 ప్రయోగించి.. నమూనాలను సేకరించి భూమికి తీసుకువస్తామన్నారు. ఈ మిషన్‌కు ఇప్పటికే ఆమోదం లభించిందని చెప్పారు. అలాగే, అంతరిక్షయానం కోసం వినియోగిస్తున్న ఇంధనానికి ప్రత్యమ్నాయ ఇంధన వనరులపై ప్రయోగం చేస్తున్నామని.. శుక్రగ్రహంపై పరిశోధనలకు అనుమతులు లభించినట్లు సోమ్‌నాథ్ వివరించారు.