India | న్యూఢిల్లీ: రక్షణ రంగంలో సైన్యం మీద భారత్ పెడుతున్న ఖర్చు పాకిస్థాన్ కన్నా తొమ్మిది రెట్లు అధికమని స్వీడన్‌కు చెందిన ఒక సంస్థ సోమవారం వెల్లడించింది. పహల్గాం దాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ఆసక్తిని రేకెత్తిస్తున్నది. సైన్యంపై అత్యధికంగా ఖర్చు పెడుతున్న దేశాలలో భారత్ ఐదో స్థానంలో ఉన్నది.
గత ఏడాది (2024) 1.6శాతం వ్యయాన్ని పెంచిన భారత్ మొత్తం 86.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7.06లక్షల కోట్లు) సైన్యం కోసం ఖర్చు పెట్టిందని స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) తెలిపింది. మరోవైపు పాకిస్థాన్ 10.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.83,640కోట్లు) ఖర్చు చేసిందని ‘ప్రపంచ సైనిక వ్యయంలో ధోరణులు-2024’ పేరిట విడుదల చేసిన నివేదికలో సిప్రీ వెల్లడించింది.