(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారక ముందే చైనా కొత్త మంట పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరోమారు కవ్వింపులకు పాల్పడింది. అరుణాచల్‌లోని పలు ప్రాంతాలను టిబెట్ దక్షిణ ప్రాంతానికి చెందినదిగా (జంగ్నన్) పేర్కొన్నది. పలు ప్రాంతాల పేర్లను మారుస్తున్నట్టు ప్రకటించి తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది.
దీంతో చైనా వైఖరిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలను ఎవరూ మార్చలేరని మండిపడింది. ‘భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టడానికి చైనా పనికిరాని, విఫల ప్రయత్నాలు చేస్తున్నట్టు మేం గమనించాం. ఇది భారత వైఖరికి విరుద్ధం. ఇలాంటి ప్రయత్నాలను నిర్దందంగా తిరస్కరిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం.
దీన్ని భారత్ నుంచి ఎవరూ విడదీయలేరు. పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరు’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. కాగా అరుణాచల్‌పై చైనా కవ్వింపులు కొత్తేంకాదు. 2017లో అరుణాచల్‌లోని ఆరు ప్రాంతాల పేర్లను మార్చుతూ చైనా జాబితా విడుదల చేసింది. 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో ఏకంగా 30 ప్రాంతాల పేర్లను మార్చుతూ జాబితా వెలువరించింది.