Maternal Mortality | న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ప్రసూతి మరణాలలో భారత్ 2023లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో 2023లో సగటున ప్రతిరోజు 52 చొప్పున మొత్తం 19 వేల ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), యునిసెఫ్, యూఎన్ పాపులేషన్ ఫండ్ తదితర సంస్థలు ఈ నివేదికను విడుదల చేశాయి. 75 వేల మరణాలతో నైజీరియా మొదటి స్థానంలో ఉంది.
ఈ విషయంలో పాకిస్థాన్ 11 వేల మరణాలతో చాలా మెరుగైన స్థితిలో ఉంది. యూఎన్ సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి సగటున 2.6 లక్షల మంది మహిళలు గర్భ, ప్రసవ సంబంధిత ఇబ్బందులు, వ్యాధులతో మరణించారు. కాగా, ఇటీవల నిలిపివేసిన యూఎస్ ఎయిడ్ మానవతా సహాయం వల్ల పలు దేశాల్లో ఆరోగ్య సేవలకు ఆటంకం ఏర్పడిందని యూఎన్ తన నివేదికలో తెలిపింది.