Trump Putin Meeting | అలస్కా (Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మధ్య జరిగిన భేటీ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ భేటీపై భారత్ (India) తాజాగా స్పందించింది. ట్రంప్-పుతిన్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతించింది. శాంతి సాధన దిశగా వారి నాయకత్వం ప్రశంసనీయమని పేర్కొంది.
‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలస్కా వేదికగా జరిగిన శిఖరాగ్ర సమావేశాన్ని భారత్ స్వాగతిస్తోంది. శాంతి సాధనలో వారి నాయకత్వం చాలా ప్రశంసనీయం. ఈ సమావేశంలో సాధించిన పురోగతిని భారత్ అభినందిస్తోంది. సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాల్లోనే ముందుకెళ్లాలి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు చూడాలని ప్రపంచం కోరుకుంటోంది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ట్రంప్-పుతిన్ మధ్య జరిగిన ఈ సమావేశం ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే దిశగా ఉంటుందని అంతా భావించారు. అయితే, ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇద్దరి మధ్య చర్చలు ముగిశాయి. సమావేశం అనంతరం ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా.. సమావేశం ఫలప్రదమైందని ట్రంప్ అన్నారు. భేటీలో అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. తమ చర్చల్లో ఎంతో పురోగతి లభించిందని, అయితే కొన్ని సమస్యలను ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఈయూ నేతలతో మాట్లాడతానని చెప్పారు. మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పగా, తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుందని ప్రకటించారు.
Also Read..
Trump Putin Meeting | ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసిన ట్రంప్, పుతిన్ భేటీ..