Trump Putin Meeting | ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భేటీ ముగిసింది. అలస్కా (Alaska) వేదికగా జరిగిన ఈ సమావేశం ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే దిశగా ఉంటుందని అంతా భావించారు. అయితే, ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇద్దరి మధ్య చర్చలు ముగిశాయి. ఇక ఈ భేటీ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపు సంవత్సరాల తర్వాత అమెరికా గడ్డపై అడుగుపెట్టిన రష్యా అధినేతకు ‘హీరో’ లెవెల్లో స్వాగతం లభించింది.
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పుతిన్ (Vladimir Putin) ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఇటీవలే తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజా భేటీలో ట్రంప్ వైఖరి పూర్తిగా మారిపోయింది. భేటీకి రెండు రోజులు తీవ్రస్వరంతో బెదిరించిన అమెరికా అధ్యక్షుడు.. పుతిన్‌ను చూడగానే ఆప్యాయంగా పలకరించారు. రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు. ఈ పర్యటన వేళ పుతిన్‌కు దాదాపు నాలుగు యూఎస్ ఫైటర్ జెట్లతో స్వాగతం లభించింది.
రష్యా అధ్యక్షుడికి ట్రంప్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. షేక్‌హ్యాండ్ ఇచ్చి చిరునవ్వుతో పలకరించారు. ఇద్దరూ చాలా ఆత్మీయంగా కన్పించారు. ఇక ట్రంప్‌తో కలిసి ‘బీస్ట్’ వాహనంలో పుతిన్ ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇద్దరూ బీస్ట్‌లో వెనుక సీట్లో కూర్చుని సమావేశ వేదిక వద్దకు వెళ్లారు. 10 నిమిషాల ఈ ప్రయాణంలో ట్రంప్ మాట్లాడుతుండగా పుతిన్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
మరోవైపు పుతిన్‌తో భేటీ వేళ ట్రంప్ తన సైనిక సత్తా ప్రదర్శించారు. ఈ భేటీకి ముందు అలాస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్-రిచర్డ్సన్ సైనిక స్థావరానికి తొలుత ట్రంప్ (Donald Trump) చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటి పుతిన్ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పుతిన్‌కు ట్రంప్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. అయితే, పుతిన్‌ను చిరునవ్వుతో పలకరించిన ట్రంప్.. అదే సందర్భంలో తన ‘పవర్ ప్లే’ చూపించారు. ట్రంప్, పుతిన్ పోడియం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా.. వారిపైనుంచి బీ-2 బాంబర్లు దూసుకెళ్లాయి. అంతేకాదు, వీరు వెళ్తున్న మార్గంలో యుద్ధ విమానాలను వరుసగా పార్క్ చేసి ఉంచారు. ఇది చూసి పుటిన్ ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలను చూసిన నెటిజన్లు, పలువురు ప్రముఖులు పుతిన్‌కు ట్రంప్ అమెరికా సైనిక సత్తాను పరోక్షంగా చూపించారు అంటూ మాట్లాడుకుంటున్నారు. కాగా, ఇటీవలే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా టెహ్రాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు అమెరికా ఈ బీ-2 బాంబర్లను ఉపయోగించిన విషయం సంగతి తెలిసిందే.
Also Read..
Hillary Clinton | ఆ పని చేస్తే ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేస్తా: హిల్లరీ క్లింటన్
Trump Putin Meeting | ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసిన ట్రంప్, పుతిన్ భేటీ..