న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యి దాటాయి. కరోనా కొత్త వేరియంట్ క్రమంగా దేశం మొత్తం విస్తరిస్తున్నది. ఇప్పటివరకు 23 రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి. దీంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కి పెరిగింది. ఇప్పటివరకు 374 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక కరోనా లాగే ఒమిక్రాన్‌కు కూడా మహారాష్ట్ర ప్రధాన కేంద్రంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 450 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్లో 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణలో 62 చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో దేశంలో రోజువారీ కరోనా కేసులు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. కొత్తగా 16,764 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 3,48,38,804కు చేరాయి. ఇందులో 3,42,66,363 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,81,080 మంది మృతిచెందారు. మరో 91,361 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 7585 మంది కోలుకోగా, 220 మంది మరణించారని తెలిపింది.
కరోనా రికవరీ రేటు 98.36 శాతం ఉందని, పాజిటివిటీ రేటు 0.89 శాతం ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు 144.54 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో గత 24 గంటల్లో 66,65,290 మందికి టీకా ఇచ్చామని పేర్కొన్నది.